ఉత్తర భారత మహిళలు - తమిళనాడు మహిళలు.. తెరపైకి కొత్త రచ్చ!

ఇందులో భాగంగా.. విజయ్ 'జన నాయగన్' సినిమాను అడ్డుకోవడం తమిళ సంస్కృతిపై దాడి అని, తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో మోడీ ఎప్పటికీ విజయం సాధించలేరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.;

Update: 2026-01-14 20:30 GMT

ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. 'తమిళ' సౌండ్ బలంగా వినిపించే పనికి పూనుకుంటున్నారు నేతలు. ఇందులో భాగంగా.. విజయ్ 'జన నాయగన్' సినిమాను అడ్డుకోవడం తమిళ సంస్కృతిపై దాడి అని, తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో మోడీ ఎప్పటికీ విజయం సాధించలేరని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ విషయంపైనా బీజేపీని కార్నర్ చేస్తూ సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు! ఈ నేపథ్యంలో తమిళనాడు మహిళలను ఉత్తర భారత మహిళల పరిస్థితితో కంపేర్ చేస్తూ డీఎంకే ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

అవును... దక్షిణాదిని, ప్రధానంగా తమిళనాడుని టార్గెట్ గా చేస్తూ బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని.. ఉత్తర భారతదేశ సంస్కృతిని తమపై బలవంతంగా రుద్దే పనికి పూనుకుంటున్నారన్నట్లుగా తమిళనాడు నేతలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర భారత మహిళలను తమిళనాడు మహిళలతో పోల్చుతూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. తమిళనాడులోని మహిళలను చదువుకోవాలని కోరితే.. ఉత్తర భారతదేశంలోని వారి సహచరులు వంటగదిలో పని చేయమని, పిల్లలను కనమని అడుగుతున్నారని అన్నారు.

క్వాయిడ్-ఇ-మిల్లత్ ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన దయానిధి మారన్.. ఇంటర్వ్యూకు హాజరైనా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా.. మన అమ్మాయిలు ల్యాప్‌ టాప్‌ తో నమ్మకంగా, గర్వంగా ఉండాలని.. ఆ విశ్వాసం తమిళనాడులో ఉందని.. అక్కడ తాము మన అమ్మాయిలను చదువుకోవాలని అడుగుతామని.. అయితే, ఉత్తరాదిలో మాత్రం.. అమ్మాయిలారా.. పనికి వెళ్లవద్దు.. ఇంట్లో ఉండకండి.. వంటగదిలో ఉండండి.. పిల్లలను కనండి.. అదే మీ పని అని చెబుతారని.. అక్కడ మహిళలను అలానే చూస్తారంటూ వ్యాఖ్యానించారు!

ఇదే సమయంలో... ఇది తమిళనాడు అని.. ఇది ద్రావిడ రాష్ట్రమని.. ఇది మాజీ సీఎం, కలైంజర్ కరుణానిధి.. మాజీ సీఎం, అన్నా, సీఎన్ అన్నాదురై.. సీఎం స్టాలిన్ ల భూమి అని.. ఇక్కడ మహిళల పురోగతే తమిళనాడు పురోగతి అని.. అందుకే ప్రపంచ కంపెనీలు చెన్నైకి వస్తాయని.. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమిళంలోనే కాదు, ఇంగ్లిష్ లో కూడా విద్యావంతులని.. ఇక్కడి ప్రభుత్వం మహిళల పురోగతిలో కీలక భూమిక పోషిస్తుందని.. తాము ఎల్లప్పుడూ మీ ప్రేమ, మద్దతును పొందుతామని మారని అన్నారు. ఇదే సమయంలో.. దేశంలోనే తమిళనాడు అత్యుత్తమ రాష్ట్రం అని తెలిపారు.

బీజేపీ నుంచి రియాక్షన్ వచ్చేసింది!:

మరోవైపు, దయానిధి మారన్ వ్యాఖ్యలపై బీజేపీ నుంచి రియాక్షన్ వచ్చేసింది. ఇందులో భాగంగా... మరోసారి దయానిధి మారన్ ఉత్తర భారత ప్రజలను దుర్భాషలాడారని.. ఈ వ్యక్తులు ఇలా చేయడానికి ఎలా అనుమతిస్తున్నారో చాలా బాధగా ఉందని.. ఇది డీఎంకే నుంచి సాధారణమైన విషయమే అని.. దయానిధి మారన్‌ కు ఇంగితజ్ఞానం లేదని తాను భావిస్తున్నాను అని తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి అన్నారు.

ఇదే సమయంలో.. మారన్ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమని బీజేపీ నాయకురాలు అనిలా సింగ్ అన్నారు. తాను భారత్‌ లో నివసిస్తున్నానని.. భారత్ శక్తిని పూజిస్తుందని అతను మర్చిపోయాడని.. శక్తిని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమంగా విభజించవచ్చని అతను భావిస్తే.. అతను మన సంస్కృతిని అర్థం చేసుకోకపోవడమే అవుతుందని.. ఈ విభజన రాజకీయాలు పనిచేయవని ఆమె అన్నారు.

Tags:    

Similar News