టి20 ప్రపంచకప్.. భారత్ లో 'పాక్' ఆటగాళ్లు..ఇందులో ట్విస్టుంది
భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో వచ్చే నెల 7 నుంచి మార్చి 8 వరకు టి20 ప్రపంచ కప్ జరగనుంది.;
భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో వచ్చే నెల 7 నుంచి మార్చి 8 వరకు టి20 ప్రపంచ కప్ జరగనుంది. డిఫెండింగ్ చాపింయన్ గా టీమ్ ఇండియా బరిలో దిగుతోంది. ఈ టోర్నీలో 2009లో మాత్రమే భారత్ ఈ హోదాలో ఆడింది. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగి తొలి టి20 ప్రపంచకప్ ను గెలచుకున్న మన జట్టు.. 2024 వరకు మరోసారి టైటిల్ గెలవలేకపోయింది. అయితే, ఏడాదిన్నర కిందట కరీబియన్ దీవులు, అమెరికా ఆతిథ్యంలో జరిగిన టి20 ప్రపంచ కప్ ను రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. వచ్చే ప్రపంచకప్ లో బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో బరిలో దిగనుంది. అయితే, ఈ టోర్నీలో పాకిస్థాన్ మ్యాచ్ లు మాత్రం మన దేశంలో జరగవు. 2023 వన్డే ప్రపంచ కప్ నకు పాక్ జట్టు భారత్ కు వచ్చింది. హైదరాబాద్ లోనే మూడు మ్యాచ్ లు ఆడింది. కాగా, పెహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాల్లో మాత్రం పాక్ జట్టు ఆటగాళ్లకు వీసాలు కుదరవని తేల్చిచెప్పారు. అసలు ఆ దేశంతో అన్ని స్థాయిల్లో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని భావించినా.. ఐసీసీ టోర్నీలలో అది సాధ్యం కాదని ఊరకున్నారు. ఇప్పుడు లంకలో జరిగే టి20 ప్రపంచ కప్ మ్యాచ్ లకు పాక్ సిద్ధం అవుతోంది. అయితే, వీరితో కాకుండా వేరే జట్టులోని పాక్ సంతతి ఆటగాళ్లకు సమస్య వచ్చి పడింది.
అమెరికా జట్టులో వారు...
టి20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన అమెరికా జట్టులో నలుగురు పాకిస్థాన్ సంతతి ఆటగాళ్లు అలీఖాన్, జహంగీర్, మొహమ్మద్ మోహ్సిన్, అదిల్ ఉన్నారు. వీరికి వీసాల జారీ ఆలస్యమైంది. అంతేగాక తమకు భారత్ వీసా ఇవ్వలేదనే అర్థంతో ఏకంగా అలీఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. ఇది వైరల్ అయింది. మరి అమెరికా జట్టులోని ఆటగాళ్లు కదా..? అందుకే భారత ప్రభుత్వం స్పందించింది.
ఏ జట్టువారైనా ప్రత్యేక పరిశీలనతో..
ప్రపంచంలో పాకిస్థానీలు ఏ జట్టుకు ఆడినా సరే.. వారికి వీసాలను ప్రత్యేక పరిశీలన అనంతరమే భారత్ జారీ చేస్తుంది. ఇది ఒక నియమంగా పెట్టుకుంది. కాగా, అమెరికా జట్టులోని పాకిస్థాన్ సంతతి వారికి వీసాలు నిరాకరించలేదని, పరిశీలన కొనసాగుతోందని భారత్ స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే అమెరికా క్రికెట్ జట్టు శ్రీలంక చేరుకుంది. ఈ జట్టులోని మిగతావారి వీసా విషయాలను అక్కడి భారత హైకమిషన్ పరిశీలించింది. పాకిస్థాన్ సంతతి వారివి మాత్రం నిలిపివేసింది. ఈ నలుగురు ఆటగాళ్లు శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం అపాయింట్ మెంట్ తీసుకున్నట్లు భారత అధికారులు తెలిపారు. అందుకే ఈ దశలో వీసాలను ప్రాసెస్ చేయలేమని పేర్కొన్నారు. అమెరికా జట్టు మేనేజ్మెంట్ కు భారత రాయబార కార్యాలయం ఫోన్ చేసింది. ఇంకా అమెరికా విదేశాగం శాఖ నుంచి సమాచారం కావాల్సి ఉందని తెలిపింది.