ఎంపీ కేకేను టెంప్టు చేసిన ఫోన్ కాల్

Update: 2020-08-26 10:10 GMT
ఆయనో ఎంపీ. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండటమే కాదు.. అప్పుడప్పుడు కీలకమైన బాధ్యతల్ని అప్పగిస్తుంటారు. ఆయనే టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే. అలాంటి ఆయన్ను ఒక వ్యక్తి ట్రాప్ చేయటం.. అతగాడి మాటల ప్రభావానికి గురయ్యారు. చివరి నిమిషంలో మోసమని గుర్తించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీలో కలకలం రేపిన ఆ ఉదంతం వివరాల్లోకి వెళితే..

తాజాగా ఎంపీ కేకేకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సదరు వ్యక్తి తనను తాను పరిచయం చేసుకుంటూ... తాను కేంద్ర పరిశ్రమల శాఖ కార్యదర్శినని.. నిరుద్యోగులకు రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇందుకు గాను.. ఎంపీ పరిధిలోని పాతిక మంది పేర్లు చెబితే సరిపోతుందని.. వారికి రూ.25లక్షలు లోన్ ఇస్తామని.. యాభై శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. మంత్రి కేటీఆర్  చెప్పటంతో తాను ఫోన్ చేసినట్లు చెప్పారు.

దీంతో కేకే నమ్మారు. తన కుమార్తెకమ్ కార్పొరేటర్ అయిన విజయలక్ష్మికి ఫోన్ చేసి.. విషయం చెప్పి.. అర్హులైన పాతిక మందిని ఒక చోటుకు చేర్చారు. తనకు ఫోన్ చేసిన మహేశ్ కు ఫోన్ చేశారు కేకే. వారికి రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని సూచన చేశారు. అందుకు ఓకే చెప్పిన మహేశ్.. ముందుస్తుగా ఒక్కొక్కరు రూ.1.2 లక్షలు కాషన్ డిపాజిట్ చేయాలని చెప్పరు. అనుమానం రాకుండా డీడీలు కడితే సరిపోతుందని చెప్పాడు. అప్పటికే మధ్యాహ్నం మూడు గంటలు కావటంతో డీడీలు తీయలేని పరిస్థితని.. ఈ రోజే గడువు పూర్తి అవుతుందని చెప్పి.. తనఖాతాలో డబ్బులు చెల్లించాలన్నారు.

ఇంతకూ మీరెక్కడ ఉన్నారు? అంటూ మహేశ్ ను కేకే అడగ్గా.. ప్రగతిభవన్ లో కేటీఆర్ వద్దే ఉన్నానని.. ఆయనకు పథకం గురించి వివరిస్తున్నట్లు చెప్పాడు. దీంతో.. మంత్రి కేటీఆర్ కు కేకే ఫోన్ చేశారు. కేటీఆర్ ఢిల్లీలో ఉన్నట్లుగా ఆయన పీఏ చెప్పటంతో.. మహేశ్ తనను మోసం చేసినట్లుగా గుర్తించారు. దీంతో.. బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పటికే కేకే సిద్ధం చేసిన నిరుద్యోగుల్లో ఒకరు రూ.50వేలు మహేశ్ బ్యాంకు ఖాతాకు తరలించటం.. అందులో నుంచి రూ.40వేలు డ్రా చేసినట్లు గుర్తించారు. నిజామాబాద్ ఏటీఎం ద్వారా ఈ పని చేసినట్లు గుర్తించారు.నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎంపీగా ఉన్న నేతనే టెంప్టు చేసేలా మాట్లాడిన మోసగాడికి మామూలోళ్లు ఎందుకు దొరికిపోరు?
Tags:    

Similar News