పాక్... మా చెడ్డ పొరుగు దేశం

పాకిస్తాన్ ని చెడ్డ పొరుగు దేశంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అభివర్ణించారు. పాక్ వైఖరిలో మార్పు ఉండకపోతే భారత్ కూడా రాజీ లేని పోరు సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు;

Update: 2026-01-02 18:15 GMT

పాకిస్తాన్ ని చెడ్డ పొరుగు దేశంగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అభివర్ణించారు. పాక్ వైఖరిలో మార్పు ఉండకపోతే భారత్ కూడా రాజీ లేని పోరు సాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మన పొరుగు వారు చెడ్డవారు అయినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని ఆయన అన్నారు. దురదృష్టవశాత్తు భారత్ కి పశ్చిమాన ఉన్న దేశం అలాంటిదే అని పాక్ ని నిందించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే విషయంలో పాక్ తన ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా ఉందని అయితే భారత్ కూడా ఈ పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు కనుక అంతే ధీటుగా బదులిస్తుందని చెప్పారు.

భారత్ హక్కు అది :

ఇక ఉగ్రవాదం నుండి తనను తాను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుంటుందని ఎస్ జై శంకర్ స్పష్టం చేశారు. భారతదేశం తన రక్షణను ఎలా ఉపయోగించుకోవాలో ఈ ప్రపంచంలో ఎవరూ నిర్దేశించలేరని ఆయన చెప్పుకొచ్చారు. చెన్నైలో ఐఐటీ మద్రాస్ టెక్నో-ఎంటర్టైన్మెంట్ ఫెస్ట్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ విదేశాంగ మంత్రి పాక్ ని మా చెడ్డ దేశం అని అభివర్ణించారు. అయితే ఆ దేశం నుంచి భారతదేశం తనను తాను రక్షించుకోవడానికి అవసరమైనదంతా చేస్తుందని క్లియర్ కట్ సందేశం ఇచ్చారు.

వసుధైవ కుటుంబకమ్‌ విధానం :

భారత విదేశాంగ విధానం మొదటి నుంచి వసుధైవ కుటుంబకమ్‌ అన్నది అని ఆయన గుర్తు చేశారు. ఏ దేశంతోనూ శతృ భావంతో ఉండరాదని అంతా కలసి ఒక కుటుంబం అని భారత్ ఎపుడూ నమ్ముతుందని ఆయన అన్నారు. అయితే అదే సమయంలో భారత్ తన ప్రయోజనాలను రక్షించుకునే విషయంలో ఏ మాత్రం ఉపేక్షించదని ఆయన చెప్పారు. నిరంతర సరిహద్దు ఉగ్రవాదం మీద పోరు సాగిస్తూనే ఉంటుందని అన్నారు. సహకారం ఇచ్చి పుచ్చుకోవడం అన్నది భారత్ విధానం అని అయితే హింసతో వీటిని ముడి పెట్టాలని చూస్తే అసలు కుదిరే వ్యవహారం కాదని పాక్ కి స్పష్టం చేశారు. భారతదేశ విస్తృత దృక్పథాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన వివరించారు. భారత్ ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూస్తుందని ఆయన అన్నారు.

నీళ్ళు ఇచ్చేది లేదు :

ఇక సింధు జలాల గురించి ఆయన ప్రస్తావించారు. భారత్ పాకిస్తాన్ ల మధ్య 1960లో సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇలా దశాబ్దాలుగా ఈ ఒప్పందం ఉందని అయితే అయితే అదే సమయంలో దశాబ్దాల పాటు ఉగ్రవాదం కొనసాగిస్తూ పొరుగుదేశం ఇబ్బంది పెట్టిందని అన్నారు. అలాంటి సమయంలో మంచి సంబంధాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. మాకు నీళ్లు ఇవ్వండి మేము మాత్రం మీపై ఉగ్రవాదాన్ని కొనసాగిస్తామని అంటే ఎవరైనా ఊరుకుంటారా అని ఆయన నిలదీశారు. పాక్ తన వైఖరిలో మార్పు లేనంతవరకూ భారత్ కూడా అలాగే దృఢంగా వ్యవహరిస్తుందని జై శంకర్ స్పష్టం చేశారు.

పాక్ నుంచే సమస్యలు :

భారత్ దేశంలో అనేక సమస్యలు పాక్ నుంచే పుట్టుకొస్తున్నాయని ఆయన అన్నారు. ఇక ఉగ్రవాదులలో మంచి చెడ్డ ఉండరని కానీ అక్కడి సైన్యంలో మాత్రం చెడ్డ వారు ఉన్నారని పరోక్షంగా పాక్సైనికాధికారులను ఉద్దేశించి జై శంకర్ వ్యాఖ్యానించారు. పాక్ విషయంలో మాత్రం భారత్ వైఖరి కఠినంగా ఉంటుందని ఆయన చెప్పేశారు. ఇటీవల ఢాకా వెళ్ళి మాజీ ప్రధాని అంత్యక్రియలలో పాల్గొన్న జైశంకర్ పాక్ అధికారులను ఎవరినీ పలకరించకుండా వెను తిరిగి వచ్చారు. దీనిని బట్టి చూస్తే పాక్ తో భారత్ తన దూకుడు వైఖరి కొనసాగిస్తుందని చాటి చెప్పారని అంటున్నారు.

Tags:    

Similar News