తెలంగాణ ఓటర్లకు పవన్ ఏం చెప్పాడంటే..

Update: 2018-12-05 10:35 GMT
నాలుగున్నరేళ్ల కిందటే జనసేన పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్. అప్పటికి పార్టీ కొత్త అని.. నిర్మాణం జరగలేదని.. అనుభవం లేదని.. ఎన్నికలకు దూరంగా ఉన్నాడు. తెలుగుదేశం.. భారతీయ జనతా పార్టీలకు మద్దతుగా ప్రచారం చేశాడు. ఐతే ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత కూడా ఆయన పార్టీ తెలంగాణ ఎన్నికలకు దూరంగానే ఉండిపోయింది. దీనికి కారణంగా ఇక్కడ ముందస్తు ఎన్నికలు జరగడం వల్ల సన్నద్ధం కాలేకపోయామంది. ఐతే తెలంగాణ ఎన్నికల సందర్భంగా తమ అభిప్రాయం చెప్పమని అందరూ అడుగుతున్నారని.. ఈ విషయం ఎన్నికల ప్రచారం చివరి రోజైన డిసెంబరు 5న వెల్లడిస్తానని పవన్ ట్విట్టర్లో రెండు రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే.

అన్న ప్రకారమే ఈ రోజు పవన్ రెండు నిమిషాల వీడియో సందేశం ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ దాశరథి రాసిన గేయాన్ని ఉటంకిస్తూ మొదలుపెట్టిన పవన్.. అనేక ఒడిదుడుకుల మధ్య తెలంగాణ యువత పోరాడి సరికొత్త రాష్ట్రాన్ని సాధించుకుందని.. తెలంగాణ అంటే తనకు సంపూర్ణమైన గౌరవముందని చెప్పాడు. ఇక ఎణ్నికల్లో ఎవరికి ఓటేయాలనే విషయంపై స్పందిస్తూ.. ఎక్కువ పారదర్శకతతో.. తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలన అందివ్వగలరని భావిస్తున్నారో వారికే ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చాడు. ఐతే పవన్ ప్రకటన విన్న జనాలు నిట్టూరుస్తున్నారు. పవన్ ఏదో ఒక స్టాండ్ తీసుకుని.. ఫలానా పార్టీకి ఓటు వేయాలని చెబుతాడేమో అని ఆశిస్తే.. ఇలా రొటీన్ డైలాగ్ పేలుస్తాడని ఊహించలేదు. ఈ మాత్రం దానికి పవన్ ఇంత బిల్డప్ ఇవ్వాలా.. అభిమానుల్ని నిరీక్షింపజేయాలా అంటూ పవన్ పై సెటైర్లు పడుతున్నాయి సామాజిక మాధ్యమాల్లో.
Tags:    

Similar News