మళ్లీ మొదలుపెట్టిన షర్మిల.. జగన్ పై సెటైర్లు

విదేశీ పర్యటనతో జగన్ పై మాటల యుద్ధానికి కొన్నాళ్లు విరామం ఇచ్చిన చెల్లెలు షర్మిల.. గురువారం నుంచి మళ్లీ స్టార్ట్ చేశారంటున్నారు.;

Update: 2026-01-29 13:09 GMT

వైఎస్ కుటుంబంలో అన్నాచెల్లెళ్ల పోరుకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. విదేశీ పర్యటనతో జగన్ పై మాటల యుద్ధానికి కొన్నాళ్లు విరామం ఇచ్చిన చెల్లెలు షర్మిల.. గురువారం నుంచి మళ్లీ స్టార్ట్ చేశారంటున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసిన షర్మిల గురువారం విజయవాడ వచ్చారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, తన సోదరుడు జగన్మోహనరెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ లో మార్పు రాలేదని, ఆయనలో మార్పు వచ్చేంతవరకు మళ్లీ అధికారంలోకి రాడంటూ శాపనార్థాలు పెట్టారు షర్మిల. మాజీ సీఎం జగన్ టార్గెట్ గా మాటల తూటాలు పేల్చిన షర్మిల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై దేశవ్యాప్తంగా ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఏపీ నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పీసీసీ చీఫ్ షర్మిల ఆహ్వానించారు. ఇక దీనిపై మీడియాతో మాట్లాడిన షర్మిల పనిలో పనిగా మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని ప్రకటించిన జగన్ తన పాదయాత్ర దేని కోసమో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము రైతు కూలీలు, వలస కార్మికుల కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని ఉద్యమిస్తున్నామని, జగన్ తన పాదయాత్ర దేనికోసమో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదంటూ శాపనార్థాలు పెట్టారు షర్మిల. ‘‘ఒక మనిషి నిజమైన నైజం తెలియాంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అన్నారు. మనం చూశాం, జగన్మోహనరెడ్డికి అధికారం సూట్ కాలేదు. జగన్ నేచర్ మారాలి. జగన్ నైజం మారాలి. జగన్ లో మార్పు వస్తే, ఆయనలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే దేవుడు ఆశీర్వదిస్తాడేమో’’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. జగన్ లో మార్పు వస్తే కాని మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని షర్మిల విమర్శలు గుప్పించారు.

"జగన్ మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే దాన్ని ఎలా ఉపయోగించాలో ఆయనకు తెలియలేదని, ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సింది పోయి, కేవలం మద్యం లాంటి స్కామ్‌ల ద్వారా డబ్బు సంపాదించడంపైనే దృష్టి పెట్టారంటూ షర్మిల ఆరోపించారు. ఈ సందర్భంగా గతంలో పోలీసుల బట్టలూడదీస్తాం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. "ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన భాష ఇది కాదు. ఆ పదజాలం చూస్తుంటేనే అర్థమవుతోంది ఆయనకు ఆ సీటు (ముఖ్యమంత్రి పదవి) గౌరవం తెలియదు అని. అధికారం ఉండాల్సిన వ్యక్తి దగ్గర ఉండాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది" అని షర్మిల ఘాటుగా స్పందించారు.

Tags:    

Similar News