జ‌గ‌న్ 2.0.. ఈసారి అంత‌కు మించి..

2024 ఎన్నిక‌ల ఓట‌మి వైసిపికి కోలుకోలేని దెబ్బ‌. పార్టీ ఉనికి ప్ర‌శ్న‌ర్థ‌క‌మైన సంద‌ర్భం. కార్య‌క‌ర్త‌ల్లో నైరాశ్యం. మ‌ళ్లీ అధికారంలోకి రాగ‌ల‌మా అన్న ప్ర‌శ్న‌.;

Update: 2026-01-29 09:49 GMT

2024 ఎన్నిక‌ల ఓట‌మి వైసిపికి కోలుకోలేని దెబ్బ‌. పార్టీ ఉనికి ప్ర‌శ్న‌ర్థ‌క‌మైన సంద‌ర్భం. కార్య‌క‌ర్త‌ల్లో నైరాశ్యం. మ‌ళ్లీ అధికారంలోకి రాగ‌ల‌మా అన్న ప్ర‌శ్న‌. ఇలాంటి సంద‌ర్భంలోనే జ‌గ‌న్ దృఢంగా నిల‌బడ్డారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి జ‌నంలోకి వ‌చ్చారు. గుంటూరు మిర్చి యార్డు సంద‌ర్శ‌న మొద‌లుకొని, పొదిలి పొగాకు రైతుల ప‌రామ‌ర్శ‌, బంగారుపాళ్యం మామిడి రైతుల ప‌రామ‌ర్శ‌, పులివెందుల అరంటి రైతుల స‌మ‌స్య వ‌ర‌కు.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పుడే వైసీపీ కార్య‌క‌ర్త‌ల్లో కొంత నిరాశ వ‌ద‌ల‌డం మొద‌లైంది. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ అంశంపై కోటి సంత‌కాల సేక‌ర‌ణ వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రెడ్ బుక్ కేసుల‌ను సైతం లెక్క‌చేయ‌ని త‌త్వం నేర్పింది. ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తిని ప‌సిగ‌ట్టిన వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు న‌మ్మ‌కం కుదిరింది.

జ‌గ‌న్ 2.0..

రెడ్ బుక్ పేరుతో వైసీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేస్తున్న సంద‌ర్భంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో ఆత్మ‌స్థైర్యం నింప‌డానికి జ‌గ‌న్ గ‌తంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము అధికారంలోకి వ‌చ్చాక‌.. త‌ప్పుడు కేసులు పెట్టిన వారిని వ‌ద‌ల‌బోము అంటూ హెచ్చ‌రించారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే మాట జ‌గ‌న్ నోట వినిపిస్తోంది. జ‌గ‌న్ 2.0 పాద‌యాత్ర త్వ‌ర‌లో మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి నుంచి మ‌రొక ఏడాదిన్న‌ర వ‌ర‌కు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి, ఆ త‌ర్వాతి ఏడాదిన్న‌ర పాద‌యాత్ర‌తో ప్ర‌జ‌ల్లో ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల జోలికి వ‌స్తే మామూలుగా ఉండ‌దు అంటూ ప్ర‌త్య‌ర్థుల‌ను హెచ్చ‌రిస్తూ, కార్య‌క‌ర్త‌లో భ‌రోసాను, ఆత్మ‌స్థైర్యాన్ని జ‌గ‌న్ నింపారు. 150 నియోజ‌క‌వ‌ర్గాలకు పైగా త‌న పాద‌యాత్ర ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అధికారంలోకి వ‌చ్చాక కార్య‌క‌ర్త‌ల‌కే ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త అంటూ స్ప‌ష్టం చేశారు. ఇదంతా వ్యూహాత్మ‌క‌మ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త‌

ఎందుకంటే 11 సీట్ల‌కు ప‌రిమిత‌మైన వైసీపీ.. ఇప్ప‌ట్లో కోలుకోవ‌డం క‌ష్ట‌మ‌న్న అభిప్రాయం విన‌ప‌డింది. కార్య‌క‌ర్త‌ల్లో కూడా అధికారంలోకి మ‌ళ్లీ వ‌స్తామ‌న్న న‌మ్మ‌కం పోయింది. దీంతో పార్టీని నిల‌బెట్ట‌డానికి, కార్య‌క‌ర్త‌ల్లో ధైర్యం నింప‌డానికి జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను వేధిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించి, జ‌గ‌న్ త‌మ‌కు అండ‌గా ఉంటార‌న్న భ‌రోసాను కార్య‌క‌ర్త‌ల‌కు క‌ల్పించారు. ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త ఇస్తామ‌ని చెప్ప‌డం ద్వారా.. అధికారంలోకి వ‌చ్చాక కార్య‌క‌ర‌క్త‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కం క‌ల్పించారు. దీంతో కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం పెరిగింది. పాద‌యాత్ర‌కు వెళ్లే స‌మ‌యానికి కార్య‌క‌ర్త‌లు స‌మాయత్తం అవుతారు. పాద‌యాత్ర‌లో భాగ‌మ‌వుతారన్న‌ది జ‌గ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది. అందుకే పార్టీ నిర్మాణాన్ని గ్రామస్థాయిలో చేప‌ట్టారు. అనుబంధ విభాగాల‌ను ఒక‌దారిలోకి తీసుకొచ్చి ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తి గ్రామ‌శాఖ బ‌లోపేతం కావ‌డం వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌ట్ట‌డానికి, పాద‌యాత్ర విజ‌య‌వంతం కావ‌డానికి దోహ‌దం చేయ‌బోతోంది. పాద‌యాత్ర స‌మ‌యంలో ప్ర‌తి మూడు రోజుల‌కు ఒక‌సారి ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గంలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించి, ప్ర‌జ‌ల్లోకి త‌న వాయిస్ బ‌లంగా తీసుకెళ్లాల‌ని జ‌గ‌న్ యోచిస్తున్నారు. ప్ర‌భుత్వ విధానాల‌ను ప్ర‌జ‌ల్లోనే నిల‌దీయాల‌ని వ్యూహం ర‌చిస్తున్నారు.

Tags:    

Similar News