ఫార్మ్ - పెర్ఫామ్ - ట్రాన్స్ ఫామ్... బడ్జెట్ టోన్ లో మోడీ కీలక వ్యాఖ్యలు!
అవును... బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు.;
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించగా.. గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ - 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి రాబోయే పాతికేళ్లు అత్యంత కీలకమని.. ఆ దిశగా బడ్జెట్ బలమైన పునాది వేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. యురోపియన్ యూనియన్ తో కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావించారు. రీఫార్మ్ - పెర్ఫామ్ - ట్రాన్స్ ఫామ్ అంటూ బడ్జెట్ టోన్ లో మాట్లాడారు. అది శుభసూచికమని.. ప్రస్తుతం భారత్ రీఫార్మ్ ఎక్స్ ప్రెస్ లో ముందుకెళ్తోందని.. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు.
రాష్ట్రపతి ప్రసంగంపై రియాక్షన్!:
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... పదేళ్లలో 25 కోట్లమందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామని.. 4 కోట్ల ఇళ్లు నిర్మించామని.. 100 కోట్లకుపైగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. అవినీతి, కుంభకోణాలను విజయవంతంగా అడ్డుకుని, ప్రజాధనం సద్వినియోగమయ్యేలా సర్కార్ చూస్తోందని తెలిపారు.
ఇదే సమయంలో... జీఎస్టీ-2.0 ద్వారా ప్రజలకు రూ.లక్ష కోట్లు ఆదా అయ్యాయని.. మన సంస్కరణల ఎక్స్ ప్రెస్ పరుగులు తీస్తోందని.. ప్రస్తుత కల్లోల పరిస్థితుల్లో ప్రపంచ దేశాలకు భారత్ ఒక వారధిగా ఉందని.. అంతర్జాతీయ వేదికలపై ఉనికిని బలోపేతం చేసుకుందని.. చెప్పిన రాష్ట్రపతి స్టార్టప్ ల విషయంలో మనది ప్రపంచంలోనే మూడోస్థానమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే... ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయం సహజమని చెప్పిన రాష్ట్రపతి.. అయితే.. కొన్నింటిపై మాత్రం విభేదాలకు ఆస్కారమే ఉండకూడదనేది మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, వాజ్ పేయీ వంటి నేతలు విశ్వసించారని తెలిపారు.
ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రపతి ప్రసంగంపైనా మోడీ స్పందించారు. ఇందులో భాగంగా... రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని.. అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోందని.. పెండింగ్ సమస్యలకు పరిష్కారాలు లభిస్తుండటంతో భారత్ ను సుస్థిరదేశంగా ప్రపంచం చూస్తోందని.. ట్రేడ్ డీల్ తో కొత్త మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఇదే క్రమంలో.. కొత్త మార్కెట్ అవకాశాల నుంచి తయారీదారులు లబ్ధి పొందాలని కోరిన ప్రధాని నరేంద్ర మోడీ.. యురోపియన్ యూనియన్ లోని 27 దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని పేర్కొన్నారు. ప్రధానంగా... వికసిత్ భారత్ కోసం ఎంపీలు కృషి చేయాలని ప్రధాని కోరారు.