అయ్యన్నపాత్రుడు సూచనలు.. అమలు దిశగా కూటమి సంచలన నిర్ణయం
విపక్ష హోదా ఇవ్వని కారణంగా వైసీపీ అసెంబ్లీని బహిష్కరిస్తూ వస్తోంది. అయితే ఈ విషయంలో ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు కూటమి సర్కారు అనేక విమర్శలు చేస్తోంది.;
ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రతిపాదిస్తున్న ‘నో వర్క్ - నో పే’ బిల్లుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 14న రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధులు విధులకు హాజరుకాకుండా జీతాలు తీసుకోవడాన్ని నిరోధించే బిల్లు తీసుకురావాలని భావిస్తోందని చెబుతున్నారు. ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఇలాంటి చట్టం లేదు. ఏపీ అసెంబ్లీలో ఈ తరహా బిల్లును ఆమోదిస్తే పెద్ద సంచనలంగానే చెబుతున్నారు.
ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం ‘నో వర్క్ - నో పే’ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో విపక్షం వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే తెచ్చుకుంది. శాసనసభలో మొత్తం నాలుగు పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, వైసీపీ మాత్రమే విపక్షంలో ఉంది. ఈ కారణంగా విపక్ష నేతగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిని గుర్తించాలని ఆ పార్టీ కోరుతుంది. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ ను కోరింది. అయితే శాసనసభ నిబంధనల ప్రకారం తగినంత సంఖ్యా బలం లేదన్న నిబంధనను చూపుతూ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఈ వివాదం ఏడాదిన్నరగా కొనసాగుతోంది. తమకు విపక్ష హోదా ఇస్తేనే సభకు హాజరు అవుతామని వైసీపీ ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు.
విపక్ష హోదా ఇవ్వని కారణంగా వైసీపీ అసెంబ్లీని బహిష్కరిస్తూ వస్తోంది. అయితే ఈ విషయంలో ఆ పార్టీని ఇరుకున పెట్టేందుకు కూటమి సర్కారు అనేక విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరింత ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేసేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను నైతికంగా కుంగదీసే వ్యూహంలో భాగంగా అసెంబ్లీకి రాకుండా దొంగచాటుగా సంతకాలు చేస్తున్నారని కొన్నాళ్లు ప్రచారం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. సభకు 60 రోజుల పాటు గైర్హాజరైతే శాసనసభ సభ్వత్వం ఆటోమెటిక్ గా రద్దు అవుతుందని నిబంధనలు ఉన్నాయని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ చెబుతూ వచ్చారు. అయితే వైసీపీ సభ్యులు సంతకాలు చేయడం వల్ల ఆ నిబంధన వర్తించే అవకాశం లేదని అంటున్నారు.
ఇదే సమయంలో వైసీపీ సభ్యులను ప్రజల్లో చులకన చేయాలనే ఉద్దేశంతో విధులకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారని విమర్శలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలను స్పీకర్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. మరోవైపు స్పీకర్ డిమాండ్ చేస్తున్నట్లు అసెంబ్లీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు జీతాలు నిలుపదల చేసే చట్టం ఏదీ ప్రస్తుతంలేదని అంటున్నారు. దీంతో సభకు వచ్చినా, రాకపోయినా ఎమ్మెల్యేలకు జీతాలు చెల్లించకతప్పడం లేదని ప్రభుత్వం వివరణ ఇస్తోంది. అయితే విపక్షాన్ని మరింత ఒత్తిడికి గురిచేసే వ్యూహంలో భాగంగా స్పీకర్ సూచనతో ‘నో వర్క్ - నో పే’ బిల్లు తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు.
అయితే ఈ ప్రతిపాదనపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ, సచివాలయ వర్గాలు, టీడీపీ కూటమి శ్రేణుల్లో ప్రస్తుతం ‘నో వర్క్ - నో పే’ బిల్లుపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలకు జీతం కట్ చేసే బిల్లును అసెంబ్లీలో ఆమోదిస్తే సరిపోదని, కేంద్రం ఈ విషయంలో చట్టం చేయాల్సివుందని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ‘నో వర్క్ - నో పే’ చట్టంపై కేంద్రంతో చర్చిస్తుందా? అసలు ఈ అంశంపై ఎలా ముందుకు వెళుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. నిజంగా ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచన ఉందా? లేక రాజకీయ వ్యూహంలో భాగంగా ఉత్తుత్తి బెదిరింపులకు దిగుతుందా? అనే చర్చ జరుగుతోంది.