తెలంగాణ స్థానిక సమరంలో జనసేన రోల్ ఏంటి.. ?
తెలంగాణ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు రంగం రెడీ అయింది. 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలకు జరగనున్నాయి.;
తెలంగాణ మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు రంగం రెడీ అయింది. 116 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలకు జరగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 31వ తేదీ వరకు జరగనుంది. ఇక, ఎన్నిక లు మాత్రం ఫిబ్రవరి 11న జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. అయితే.. ఈ ఎన్నికలలో రాష్ట్ర పార్టీలతో పాటు.. జనసేన కూడా బరిలోకి దిగనుంది.
దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ కీలక చర్యలు తీసుకుంది. ఇటీవలే.. రాష్ట్ర కమిటీలను రద్దు చేసింది. దీని స్థానంలో కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీని ద్వారా ఔత్సాహిక యువతకు పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. తద్వారా.. స్థానిక సంస్థల్లో తమ హవా ప్రకటించుకోవాలన్నది జనసేన వ్యూహం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇదే విషయంపై పార్టీ నాయకులతో భేటీ అయ్యారు.
అనంతరం వాయువేగంతో పార్టీ కమిటీలను రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇక, 116 మునిసిపాలిటీలలో కనీసం 50 మునిసిపాలిటీల్లో అయినా పోటీ చేయాలన్నది జనసేన వ్యూహంగా ఉందని తెలుస్తోంది. యువతను పెద్ద ఎత్తున వినియోగించుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలన్నది జనసేన లక్ష్యంగా ఉంది. అయితే.. ఇప్పటికిప్పుడు పార్టీకి అభ్యర్థులను ఎంపిక చేయడం ఏమేరకు సాధ్యమనేది ప్రశ్న.
ఇక, ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. మరో నాలుగు రోజులు మాత్రమే నామినేషన్లకు గడువు ఉంది. ఇంత స్వల్ప సమయంలో జనసేన పుంజుకుని.. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం.. సాధ్యమేనా? అనేది కార్యకర్తలు అనుసరించే వ్యూహాలను బట్టి.. పార్టీ ఏర్పాటు చేసుకునే లక్ష్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది.