పవన్ కంటే కేఏ పాల్ బెటర్ కదా..!

Update: 2019-05-22 10:54 GMT
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అసలు ఘట్టానికి సమయం ఆసన్నమైంది. గురువారం జరిగే కౌంటింగ్ కోసం రాష్ట్రంలోని పార్టీలన్నీ సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే అధికార తెలుగుదేశం, ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు కూడా శిక్షణను ఇచ్చేశాయి. ఇందులోనే కౌంటింగ్‌ లో వ్యవహరించాల్సిన తీరుపై వారికి అవగాహన కల్పించారు. అలాగే కౌంటింగ్‌ ప్రక్రియను మొత్తం వివరించారు. ఈ విషయంలో జనసేన పార్టీ హడావిడి మాత్రం అస్సలు కనిపించడం లేదు. ఓట్ల లెక్కింపు గురువారం జరుగనుండడంతో ఫలితాల కోసం నాయకులే కాకుండా అనేక మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి తారాస్థాయికి చేరుకుంది. కానీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం మీడియాకే కాదు.. సొంత పార్టీ నాయకులకు కూడా కనిపించడంలేదట.

ఎన్నికలకు ముందు కొన్ని యాత్రలు చేసిన పవన్ కల్యాణ్.. ప్రజలకు అందుబాటులో ఉంటానని పదే పదే ప్రకటనలు చేసేవారు. గెలిస్తే పాలిస్తాం.. ఓడిపోతే ప్రశ్నిస్తాం అనే నినాదంతో ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచీ ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు చాలా మంది ప్రముఖులు ఈ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీలో ఉన్నారు. అయితే, ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో జనసేన ప్రభావం ఏమాత్రం ఉండదని తేలిపోయింది. అంతేకాదు, ఆ పార్టీకి ఐదు సీట్లు వస్తాయని కూడా ఏ సర్వే చెప్పలేదు. ఈ విషయంపై ఆ పార్టీ నాయకులు మాత్రం స్పందించడం లేదు. అంతేందుకు ఎన్నికలు ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ ఏమైపోయారు అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది.

ఎన్నికలు మొత్తంలో పవన్ కల్యాణ్ కంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం వరకు ఆయన వినూత్నంగా వ్యవహరించారు. అంతేకాదు, ఆయన ఎప్పుడు మాట్లాడినా తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పేవారు. అంతెందుకు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత కూడా ఆయన స్పందించారు. ''దేశంలో జరిగిన ఎన్నికలు, ఆదివారం ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి షాకయ్యా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్‌, మానిప్యులేట్‌, మేనేజ్‌ చేశారు. నరసాపురం ఈవీఎంలలో 12 బటన్‌(హెలికాప్టర్‌) నొక్కితే... 2వ బటన్‌(ఫ్యాన్‌ గుర్తు)కు ఓట్లు పడ్డాయి. ఈ విషయాన్ని కొంత మంది ఓటర్లు నా దృష్టికి తెచ్చారు. ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదులు చేశా'' అంటూ చెప్పుకొచ్చారు. దీంతో కనిపించకుండా పోయిన పవన్ కంటే కేఏ పాల్ బెటర్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


    
    
    

Tags:    

Similar News