ప్ర‌జ‌ల ముందుకు జ‌న‌సేనాని..

Update: 2018-01-20 16:29 GMT
జనసేన పార్టీ అధినేత - సినీ నటుడు పవన్ కళ్యాణ్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. త్వరలో తాను చేపట్టనున్న రాజకీయ యాత్రపై ఇవాళ ట్విట్టర్‌ లో స్పందించారు. ఆస‌క్తిక‌రంగా ఇందుకు తెలంగాణ‌ను వేదిక‌గా చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కొండ‌గ‌ట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభిస్తానని ప‌వ‌న్ వెల్ల‌డించారు. తెలుగు రాష్ర్టాల్లోని తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు మొదటగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోనున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి వ‌ల్లే..తాను 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని ప‌వ‌న క‌ళ్యాణ్ తెలిపారు. తమ కుటుంబ ఇల‌వేల్పు కూడా ఆంజ‌నేయ‌స్వామి కావ‌డం తాను కొండ‌గ‌ట్టును కేంద్రంగా ఎంచుకునేంద‌కు కార‌ణ‌మ‌ని వివ‌రించారు. తానుచేపట్టనున్న రాజకీయ యాత్రలో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి అవగాహన పెంచుకుంటానని పవన్‌ కల్యాణ్ వెల్ల‌డించారు.

కాగా,  2019 ఎన్నిక‌ల‌కు తాము సిద్ధ‌మ‌వుతున్నామ‌ని...వ‌చ్చే ఏడాది ఇందుకు త‌గిన పూర్తి కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తాన‌ని కొద్దికాలం క్రితం ప‌వ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ త‌న రాజ‌కీయ యాత్ర‌కు సిద్ధ‌మైన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News