పవన్ మేని 'ప్లేట్' ఫేస్టో

Update: 2018-07-18 11:49 GMT
ఎన్నికల వేళ......అమాయకపు ప్రజల మనసు దోచుకునే వేళ...  వేయి అబద్దాలు ఆడైనా సరే ఎన్నికలలో గెలవాలంటున్నారు రాజకీయ నాయకులు. ఎన్నికల ముందు మేనిఫెస్టో రిలీజ్ చేయడం పరిపాటే. తాము గెలిచాక ప్రజలకు ఏమి చేద్దామని అనుకుంటున్నారో ఒక పుస్తకాన్ని విడుదల చేస్తారు రాజకీయ నేతలు. ఆ పుస్తకమే ఎన్నికల మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో సంగతి కొన్ని పార్టీల‌కు కనీసం గుర్తు కూడా ఉండదు.

 జనసేన నాయకుడు - పవర్ స్టార్ రాజ‌కీయానుభ‌వం లేక‌పోయినా అందరి కంటే నాలుగాకులు ఎక్కువ చదువుకున్నారు - ఈయన ఏకంగా 175 పుస్తకాలను మేనిఫెస్టో రూపంలో విడుదల చేస్తున్నారు. ఇన్ని పుస్తకాలేమిటని ఆశ్చర్యపోతున్నారా!?.. నియోజకవర్గానికొక మేనిఫెస్టోని విడుదల చేస్తున్నారట ఆయ‌న‌.  రాష్ట్రం లో అన్ని నియోజక వర్గాలలో ప్రజలకి ఒకేరకమైన సమస్యలుండవు కదా.  అందుకే నియోజకవర్గాలలోని ప్రజల సమస్యలను తెలుసుకుని - వాటి పరిష్కారాలు కూడా మా మేనిఫెస్టోలో  చేరుస్తాం అని జనసేన నాయకులు చెప్పారు.

జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ పోరాట యాత్ర మొదలు పెట్టారు. ఒక్కొక్క నియోజకవర్గంలో తిరుగుతూ - అక్కడి ప్రజల సమస్యలను తెల్సుకుని - వాటికి పరిష్కారాలు చేబుతూ - ఆయా నియోజకవర్గానికి సంబంధించిన మేనిఫెస్టోను విడదల చేస్తారని జనసేన చెప్పింది. వచ్చే నెల నుండి ఈ మేనిఫెస్టోల్ని విడుదల చేస్తారని చెప్పారు. అయితే ఈ మేనిఫెస్టోను పవన్ కల్యాణ్  ఒక చిత్తు కాగితాల పుస్తకం లాగే చూస్తారా...లేదా అన్నది వేచి చూడాలి.
Tags:    

Similar News