క్రాష్ అయినప్పుడే కొనేయాలి.. అతడి తాజా పోస్టు చూశారా?
ధనవంతుడు.. సంపన్నుడు ఒకడేనా? ఈ రెండు పదాల అర్థాలు ఒకటే అవుతాయా? అంటే అవునని చెబుతారు చాలామంది.;
ధనవంతుడు.. సంపన్నుడు ఒకడేనా? ఈ రెండు పదాల అర్థాలు ఒకటే అవుతాయా? అంటే అవునని చెబుతారు చాలామంది. కానీ.. వాస్తవంలో ఆ రెండింటి అర్థాలు వేరు. ప్రపంచంలో అత్యుత్తమ వంద పుస్తకాల్లో ఒకటిగా చెప్పే రిచ్ డాడ్.. పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పోస్టు చేసే ట్వీట్ లు సంపదను ఎలా చూడాలన్న దానిపై స్పష్టత ఇచ్చేలా ఉంటుందని చెప్పాలి.
అంతేకాదు.. సంపదను క్రియేట్ చేసుకునే విషయంలో ఫాలో కావాల్సిన అంశాల్ని ఆయన తనదైన శైలిలో చెబుతుంటారు.తాజాగా అలాంటి విషయాలు కొన్నింటిని షేర్ చేసుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినప్పుడు ధనవంతులు కావటం ఎలా? అన్న విషయాన్ని ఆయన చెబుతూ.. ఎంతో విలువైన సూచనల్ని సింఫుల్ గా.. అందరికి అర్థమయ్యేలా చెప్పేయటం విశేషం.
ధనవంతుడ్ని డాలర్లలో కొలుస్తారని.. సంపన్నుడ్ని సమయంతో కొలుస్తారన్న ఆయన.. ‘‘ఉదాహరణకు ఒక ధనవంతుడు ‘నా బ్యాంక్ అకౌంట్లో మిలియన్ డాలర్లు ఉన్నాయి’ అని అనొచ్చు. అదే సమయంలో ఒక సంపన్నుడు‘నేను ఈ రోజు పని చేయకపోయినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏడు నెలలు జీవిస్తా’ అని చెబుతాడు. ఈ ఇద్దరిలో నువ్వు ఎవరి తీరును అనుసరిస్తావు అని ప్రశ్నిస్తూ.. ‘‘నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించటానికి పని చేస్తున్నావా? దీర్ఘకాలంగా సంపదను నిర్మించుకొని నిజమైన ధనవంతుడు కావటానికి పని చేస్తున్నావా? ధనవంతుడు డబ్బు సంపాదించాలి. అదే సమయంలో సంపన్నుడి కోసం డబ్బు పని చేస్తుంది’’ అని పేర్కొన్నారు.
ఆర్థిక సంక్షోభ సమయంలో సంపదను పెంచుకోవటానికి మీరేం చేస్తారు? అని ప్రశ్నిస్తూ.. ‘‘ఇప్పుడే ప్లాన్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే కఠిన ఆర్థిక పరిస్థితులు తలత్తే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండు’’ అని హెచ్చరించిన ఆయన తన వరకు తాను ఏం చేశాడన్న విషయాన్ని వెల్లడించారు. ‘ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో అనేక ఆస్తుల ధరలు తగ్గుతాయి.తక్కువ ధరకు మంచి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి. ఆ సమయంలోరియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో మరింత ధనవంతులు అవ్వొచ్చు. నేను మూడు ఆర్థిక సంక్షోభాల సమయంలో ఈ సూత్రాన్నే ఫాలో అయ్యా’ అని చెప్పటం ద్వారా ప్రపంచ ఆర్థిక సంక్షోభం వేళలో ఏం చేయాలన్న విషయంపై పూర్తి స్పష్టతను ఇచ్చారని చెప్పాలి.