కేంద్రం నుంచి గట్టిగా లాగేస్తున్న చంద్రబాబు.. ఇదే సీఎం స్పెషల్!
కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వాడుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు.;
కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వాడుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన నిధులలో సగభాగం కేంద్రం నుంచి తీసుకువస్తూ సీఎం చంద్రబాబు సమర్థంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సొంతంగా అభివృద్ది కార్యక్రమాలకు నిధులు వెచ్చించలేని పరిస్థితుల్లో కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు చేసి గరిష్టంగా లబ్ధి పొందుతున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యారని, కానీ సీఎం చంద్రబాబు తన అనుభవంతో పలు కేంద్ర పథకాలను రాష్ట్రంలో విరివిగా అమలు చేసి అభివృద్ధితోపాటు నిధుల కొరతను అధిగమిస్తున్నారని అంటున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా వాడుకోలేకపోయిందని విమర్శలు ఎదుర్కొంది. అదే సమయంలో కేంద్ర నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో పలు కేంద్ర పథకాలకు నిధుల విడుదలను కేంద్రం నిలిపేసింది. ప్రధానంగా పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఇతర అకౌంట్లకు మళ్లించడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఎన్నిసార్లు హెచ్చరించినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కేంద్రమే నేరుగా పంచాయతీల అకౌంట్లకు నిధులు జమ చేయడం ప్రారంభించిందని గుర్తు చేస్తున్నారు.
ఇలా పంచాయతీలే కాకుండా దాదాపు 130కి పైగా కేంద్ర పథకాలను వాడుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చుకోవాలని ఆయన అధికారులను పదేపదే అప్రమత్తం చేస్తున్నారు. ఫలితంగా ఇటీవల పంచాయతీరాజ్ శాఖకు భారీగా నిధులు వచ్చాయని అంటున్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) కింద స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శిక్షణకు కేంద్రం సూచనలు చేసింది. గత ప్రభుత్వంలో ఈ శిక్షణను పట్టించుకోకపోవడంతో స్థానిక సంస్థలకు కేంద్రం నిధుల విడుదలను ఆపేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను అప్రమత్తం చేయడంతో వెంటనే శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టారు.
ఇలా 18 నెలల్లోనే 1.36 లక్షల మందికి శిక్షణ ఇవ్వడంతో రాష్ట్రం 24వ స్థానం నుంచి తొలిస్థానానికి ఎగబాకింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రం వాటా నిధుల విడుదలకు మార్గం సుగమమైందని అంటున్నారు. అదేవిధంగా పూర్ణోదయ పథకాన్ని కూడా గత ప్రభుత్వం వాడుకోలేకపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకంపై ఫోకస్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి కేంద్రం నుంచి రూ.40 వేల కోట్ల నిధులు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నిధులతో సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యానపంటల విస్తరణ, గ్రామీణ రహదారులు వంటి మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు తయారు చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే సూచించారు.
పూర్వోదయ స్కీమ్‌లో భాగంగా రూ.40 వేల కోట్లు వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రూ.20 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు, మిగిలిన రూ.20 వేల కోట్లతో మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం సూచించారు. ఈ డబ్బు అంతా కేంద్రమే ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ లబ్ది జరుగుతుందని అంటున్నారు. గత ప్రభుత్వం ఇలాంటి పథకాలను సమర్థంగా వాడుకోలేకపోవడంతో అభివృద్ధిని విస్మరించిందనే అపవాదును మూటగట్టుకుందని విశ్లేషిస్తున్నారు. జల జీవన్ మిషన్, పీఎం సూర్యఘర్ ఇలా చాలా పథకాలను రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేంద్రం నుంచి భారీగా నిధులు సేకరిస్తున్నారని అంటున్నారు.