ట్రైన్ జర్నీలో ప్రాణాలు పోయిన కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ముంబయి సబర్బన్ ట్రైన్ లో జర్నీ చేస్తూ.. ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుడికి పరిహారం చెల్లించే విషయంలో కేంద్రం వాదనను తప్పు పట్టిన బాంబే హైకోర్టు..;
నిర్లక్ష్యం వేరు.. గత్యంతరం లేని పరిస్థితి వేరు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి రెండు అంశాల్ని గుర్తించే వేళలో కొన్ని సంస్థలు.. వ్యవస్థలు తొండి వాదనల్ని వినిపిస్తుంటాయి. అలాంటి ప్రయత్నం చేసిన రైల్వే శాఖకు బాంబే హైకోర్టు కళ్లు తెరిచే రీతిలో చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముంబయి సబర్బన్ ట్రైన్ లో జర్నీ చేస్తూ.. ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుడికి పరిహారం చెల్లించే విషయంలో కేంద్రం వాదనను తప్పు పట్టిన బాంబే హైకోర్టు.. కీలక అంశాల్ని ఎత్తి చూపిన వైనం ఆసక్తికరంగా మారింది.
అసలేం జరిగిందంటే.. 2005 అక్టోబరు 28న ముంబయిలోని భాయందర్ నుంచి మెరైన్ లైన్స్కు సబర్బన్ ట్రైన్ లో వెళుతున్న ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన అతను చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మరణించిన కుటుంబానికి అందాల్సిన పరిహారం చెల్లించాల్సిందేనని 2009 డసెంబరులో స్థానిక ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది.
దీనిపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ కేంద్రం హైకోర్టులో అప్పీల్ చేసుకుంది. మరణించిన ప్రయాణికుడి వద్ద టికెట్ లేదని.. అతను కింద పడి ప్రాణాలు కోల్పోయాడని.. అతను నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రమాదానికి గురైనట్లుగా వాదనలు వినిపించింది. దీనిపై బాంబే హైకోర్టు విభేదించింది. రద్దీ సమయంలో మరో మార్గం లేకనే ప్రాణాలు పణంగా పెట్టి డోర్ దగ్గర బాధితుడు అలా నిలబడాల్సి వచ్చిందని.. దాన్ని నిర్లక్ష్యంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అంతేకాదు.. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాల్సిందేనన్న కింది కోర్టు తీర్పును సమర్థించింది. ఇప్పటికైనా రైల్వే శాఖ తన మొండితనాన్ని పక్కన పెట్టి.. బాధితుడి కుటుుంబానికి పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. మరేం జరుగుతుందో చూడాలి.