ధర్మవరంలో దానధర్మాలు.. ‘గుడ్ మార్నింగ్’లాంటి కార్యక్రమం కానేకాదు!
కేతిరెడ్డికి భిన్నంగా పనిచేస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్ లో ధర్మవరంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అంటున్నారు.;
ధర్మవరం నియోజకవర్గం అంటే టక్కున గుర్తుకు వచ్చేది ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’ కార్యక్రమమే.. వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రోజూ చేసిన ఈ కార్యక్రమం యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యేది. అధికారులు, వైసీపీ నేతలను వెంటేసుకుని ధర్మవరం పట్టణంలోని వీధులన్నీ తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకునేవారు కేతిరెడ్డి. అయితే ఆయన కార్యక్రమం యూట్యూబ్ లో ఇతర ప్రాంతాల వారిని ఆకర్షించినట్లు... ధర్మవరం వాసులను ఆకట్టుకోలేకపోయిందేమో, గత ఎన్నికల్లో కేతిరెడ్డికి వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చారు. ఆయన స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కేతిరెడ్డికి భిన్నంగా పనిచేస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్ లో ధర్మవరంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అంటున్నారు.
ఇటీవల తన నియోజకవర్గంలో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థులు అందరికీ తన సొంత డబ్బులతో ఫీజులు కట్టిన మంత్రి సత్యకుమార్ యాదవ్.. తాజాగా మరో సేవా కార్యక్రమానికి తెరతీశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ను ధర్మవరం రప్పిస్తూ గురువారం భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంత్రి సత్యకుమార్ తన కుమార్తె పేరుతో 15 ఏళ్ల నుంచి నడుపుతున్న 'సంస్కృతి సేవా సమితి' తరపున విద్యార్థులు, నిరుద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివుతున్న సుమారు 2 వేల మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందచేయాలని తాజాగా నిర్ణయించారు. గురువారం ఒకేసారి సైకిళ్లను విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తోపాటు పలువురు బీజేపీ అగ్రనేతలు పాల్గొనబోతున్నారు.
సైకిళ్ల కొనుగోలుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని సంస్కృతి సేవా సమితి సుమారు రూ.98 లక్షలను వ్యయం చేసింది. నియోజకవర్గంలో 41 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాసేందుకు 2,087 మందికి అవసరమైన ఫీజు కింద రూ.2,60,875ను జిల్లా విద్యా శాఖ ద్వారా మంత్రి గత వారం చెల్లించారు. అలాగే ధర్మవరంలోని 6 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను రూ.35 లక్షలతో నిర్మించారు.
సేవా కార్యక్రమాల పరంపర
మంత్రి సత్యకుమార్ తన కుమార్తె ‘సంస్కృతి’ పేరుతో ఏర్పాటుచేసిన సేవా సమితి ద్వారా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెంది డిగ్రీ పూర్తి చేసిన 25 మందిని సివిల్స్ పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. రెండేళ్ల కాల పరిమితితో ఓ కోచింగ్ సంస్థ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాలు కిందటేడాది సెప్టెంబరు నుంచి ప్రారంభమయ్యాయి. ఉచిత శిక్షణ, అన్ని ఖర్చుల కింద కలిపి రెండేళ్లకు కలిపి సుమారు కోటి వరకు వ్యయమవుతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో నిర్వహించిన 'మెగా జాబ్ మేళా' ద్వారా 2,400 మందికి ఉద్యోగాలు కల్పించారు. స్కిల్ డెవలప్మెంటు ద్వారా మరో 2,066 మందికి ఉద్యోగాలు లభించాయి.
సంస్కృతి సేవా సమితి ద్వారా పాఠశాలలు, హాస్టళ్లలో 50 ఎల్పీహెచ్ ఆర్ఓ వాటర్ ప్లాంట్సును ఏర్పాటు చేస్తున్నారు. ధర్మవరంలోని పోతుకుంట బీసీ కాలనీలో 2500 ఎల్పీహెచ్ సామర్థ్యంతో, కేతిరెడ్డి కాలనీలో 1000 ఎల్పీహెచ్ సామర్థ్యంతో ఆర్ ఓ ప్లాంట్లను రూ.20 లక్షల వ్యయంతో ఏర్పాటుచేశారు. అలాగే ధర్మవరంలోనే మంచినీరు కోసం 5 వాటర్ ఏటీఎంలను రూ.15 లక్షలతో సమకూర్చారు. అదేవిధంగా మహాత్మా జ్యోతిభాపూలే పాఠశాల, ఆయుర్వేద వైద్య కళాశాలల ఏర్పాటు, మరిన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి భిన్నంగా పనిచేస్తున్న మంత్రి సత్యకుమార్ యాదవ్ సైలెంటుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారని ప్రశంసలు అందుకుంటున్నారు.