డేటాతో రండి......ఇండిగోకు డీజీసీఏ బులావ్...
ఇండిగో విమానాల రద్దు పెద్ద సంక్షోభంగా మారడంతో ఆ సెగలు కేంద్రాన్ని తాకాయి. అసలే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రతిపక్షం గరం గరంగా ఉంటుంటే...ఈ వివాదం మంచి ఆయుధంగా దొరికింది.;
వరద ఆగింది...బురద మిగిలింది...ఇండిగో ఘటన అచ్చం ఇలాంటిదే. అర్ధాంతరంగా సాంకేతిక సమస్యలంటూ దాదాపు 550 విమానాలను రద్దు చేసి విమానయాన చరిత్రలోనే రికార్డు సృష్టించిన ఇండిగోపై ఇపుడు పోస్ట్ మార్టం షురూ అయ్యింది. నిజంగా సాంకేతిక సమస్యలా...లేదా కావల్సిగా చేశారా? కొత్త నిబంధనల్ని కేంద్రం బేషరతుగా వెనక్కి తీసుకునేందుకే ఈ కుట్ర పన్నారా? ప్రయాణికులకు రీఫండ్ చేశారా? వారి వేదనను తగ్గించారా? ఈ విషయాలపై సంబంధిత శాఖ ఆరా తీయడం మొదలె్ట్టింది. ఈ నేపథ్యంలోనే ఇండిగో సీఈవో పీటర ఎల్బర్ట్స్ ఇతర విబాగాల అధికారులు అన్ని వివరాల డేటాతో ఈనెల 11న కార్యాలయానికి హాజరు కావల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాకీదులిచ్చింది.
ఇండిగో విమానాల రద్దు పెద్ద సంక్షోభంగా మారడంతో ఆ సెగలు కేంద్రాన్ని తాకాయి. అసలే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రతిపక్షం గరం గరంగా ఉంటుంటే...ఈ వివాదం మంచి ఆయుధంగా దొరికింది. విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడిని దుమ్ముదులిపి వదలిపెట్టారు. కేంద్రం ఒకపక్క ప్రతిపక్షానికి దీటుగా సమాధానాలు ఇస్తూనే మరో పక్క నష్టనివారణ చర్యలు చేపట్టింది. కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ఇండిగో పై మాట్లాడితే...ఇదో పోస్ట్ మార్టం రిపోర్ట్ లా ఉందని ప్రతిపక్షం ఎద్దేవా చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఇండిగోపై గుర్రుగా ఉంది. అప్పుడే ఆ సంస్థపై కొరడా ఝళిపించడం ప్రారంభించింది. మొదటి చర్యగా దాని స్లాటుల్లో భారీ కోత విధించింది. తాజాగా డీజీసీఏ వివరాలతో హాజరు కావల్సిందిగా ఆదేశించింది.
డీజీసీఏ ఆదేశాల ప్రకారం ఇండిగో సీఈవో, సంబంధిత విభాగాల సీనియర్ అధికారులు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు డీజీసీఏ కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలి. విమానల సర్వీసుల్లో అంతరాయానికి సంబందించి పూర్తిస్థాయి డేటా, అప్ డేట్ వివరాలు, నివేదికతో సిద్దంగా ఉండాలని అని డీజీసీఏ ఆదేశించింది. సిబ్బంది నియామకాల ప్లాన్, పైలట్లు, కేబిన్ సిబ్బంది వివరాలు, రద్దయిన విమానాల సంఖ్య, ఎంతమేరకు ప్రయాణికులకు రీఫండ్ చేశారు తదితర సమాచారాన్ని కచ్చితమైన వివరాలను గణాంకాలతో సహా సిద్ధం చేసుకుని తీసుకు రావాలని డీజీసీఏ కార్యాలయం హుకూం జారీ చేసింది.
ఇండిగో విమానాల రద్దు ఘటనపై ఇప్పటికే డీజీసీఏ నలుగురు సభ్యలతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా సంస్థపై కచ్చితంగా చర్యలుంటాయని పౌర విమానాయాన శాఖ స్పష్టం చేసింది. కాగా కచ్చితమైన వివరాల సేకరణకు మరింత సమయం కావాలని ఇండిగో సంస్థ అభ్యర్థించింది. ఇప్పటికే ఇండిగో సీఈవో కు డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది.