ఆగస్టులో టీడీపీని పవన్ ఖాళీ చేస్తారట

Update: 2018-03-22 16:59 GMT
గత ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి పనిచేసి నిన్నమొన్నటి వరకు ఆయనతోనే అంటకాగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు చంద్రబాబుకు ఇస్తున్న షాకులు తెలిసిందే. చంద్రబాబుతో డిఫరై ఆయన సొంతంగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలు.. ఆయనకు బీజేపీతో రహస్య సంబంధాలున్నాయన్న చంద్రబాబు అండ్ టీం ఆరోపణలు కూడా అందరికీ తెలిసిందే. పవన్ చంద్రబాబుకు ఈ రేంజి షాకిస్తాడని కొద్దికాలంగా గెస్ చేస్తున్న వారు ఇప్పడు ఇంకో గెస్ చేస్తున్నారు. గత ఘటనలను కూడా గుర్తు చేసి దీనికి ఆధారాలున్నాయని వాదిస్తున్నారు. ఇంతకీ ఆ షాకేంటో తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. టీడీపీకి మరో ఆగస్టు సంక్షోభాన్ని సృష్టించడమే పవన్ ప్రణాళికని ఫిలిం నగర్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే... అదెలా ఉండబోతుందన్నదే కీలకం. పవన్ చెప్తున్నట్లుగా 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు కాకపోయినా టీడీపీకి కాపు ఓట్లు సాధించి పెడతారనుకుంటున్న కొందరు కీలక కాపు నేతలను పవన్ తన పార్టీలోకి తీసుకోబోతున్నారన్నదే ఆ గుసగుసల సారాంశం.
    
అయితే.. ఇంకా పూర్తిగా నమ్మకం సాధించుకోలేకపోతున్న పవన్ కోసం అంత రిస్కు తీసుకుంటారా అన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి . ఈ గుసగుసలాడుతున్నావారు దానికి కూడా ఒక బలమైన కారణం చెప్తున్నారు. మరి కొద్ది రోజుల్లో పవన్ అన్న మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి సడెన్‌ గా ఒక రోజు మీడియా ముందుకు వస్తారని.. ఆయన పవన్‌ కు తానున్నానని చెప్తారని.. తన రాజకీయ ప్రయాణమూ పవన్‌ తోనేనని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. చిరు రాకతో సీను మారుతుందని.. పార్టీలకతీతంగా కాపు నేతల ఏకీకరణ జరగబోతోందని సమాచారం.
    
చిరు పట్ల కూడా చాలామందిలో అపనమ్మకాలున్నా కూడా పవన్ - చిరులు కలిసి కట్టుగా రాజకీయాల్లోకి ఫుల్ టైంగా వచ్చేస్తే ఎవరికీ ఎలాంటి జంకూగొంకూ ఉండదని.. వారిద్దరి వెంట నడుస్తారని భావిస్తున్నారు.
    
నిజానికి పవన్ - చిరుల మధ్య చాలాకాలంగా కొంత దూరం ఏర్పడినప్పటికీ ఇప్పుడు అదంతా సమసిపోయిందని చెప్తున్నారు. పవన్ కొద్దికాలం కిందట తన ప్రసంగంలో చిరు గురించి చెప్పడం - తన అన్నను మోసం చేసిన వారిని వదిలిపెట్టబోనని చెప్పడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. అంతేకాదు.. నెల రోజుల కిందట జనసేన ఆఫీసులో ముఖ్యకార్యకర్తలతో పవన్ సమావేశంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక ఫోన్ రావడం.. ఆయన సుమారు గంట సేపు ఫోన్లో మాట్లాడి.. అలాగే మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ ఫోన్ చిరు నుంచేనని.. పవన్‌కు చిరు డైరెక్షన్ చేస్తున్నారని.. దాని ప్రకారమే పవన్ స్పీడు పెంచారని అంటున్నారు. చిరు ఎంటరవడమే తరువాయని.. అది జూన్ - జులై ల్లో ఉండొచ్చని.. ఆ తరువాత ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టి ఆగస్టుకల్లా టీడీపీని ఖాళీ చేసే పనికి పవన్ దిగుతారన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇందులో నిజమెంతో.. అబద్ధమెంతో చెప్పలేం కానీ.. ప్రచారంలో ఉన్న లాజిక్కులన్నీ నిజమనేలాగే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News