పొత్తులకు తెర దించేసిన పవన్...

Update: 2019-02-22 14:40 GMT
తెలంగాణ ఎన్నికలకు ముందు తెరాస అధినేత కేసీఆర్ ఎంతో అమాయకంగా ముఖం పెట్టి తనను కాంగ్రెస్ - బీజేపీలు ఆడుకుంటున్నాయని చెప్పడం గుర్తుండే ఉంటుంది. తాను బీజేపీ మనిషినని కాంగ్రెస్.. కాంగ్రెస్ మనిషినని బీజేపీ ఆరోపిస్తున్నాయని చెబుతూ కేసీఆర్ తన ఎన్నికల సభల్లో చెప్పుకొనేవారు. ఇప్పుడు ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే మార్కు రాజకీయం చేస్తున్నారు. తాను టీడీపీతో కలిశానని వైసీపీ ఆరోపిస్తోందని.. తాను వైసీపీ - టీఆరెస్‌ లో కలిసి పనిచేస్తున్నానని టీడీపీ ఆరోపిస్తోందని.. మొత్తానికి తనతో ఆడుకుంటున్నారని పవన్ అంటున్నారు.
   
ఈ మేరకు ఆయన శుక్రవారం ట్విటర్లో వరుస ట్వీట్లు చేస్తూ హడావుడి చేశారు. ట్వీట్లలో ఆయనేమన్నారంటే.. ‘‘జనసేన పార్టీ బీజేపీ - వైసీపీల మద్దతుదారు అని టీడీపీ విమర్శిస్తోంది. వైసీపీ ఇప్పుడు జనసేనని టీడీపీ భాగస్వామి అంటోంది. రాజభవన్ లో నేను కేసీఆర్ గారిని కలిసినప్పుడు టీడీపీ నన్ను టీఆర్ ఎస్ - వైసీపీలతో కుమ్మక్కయ్యాను అంది.  ప్రజలకోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నప్పుడు అన్ని వైపుల నుంచీ  ఇబ్బందులు  రావడం సహజం. టీడీపీ - వైసీపీ కలిసి జనసేన  ప్రతిష్ఠని దెబ్బతీసేవిధంగా వరుస కథనాలు సృష్టిస్తున్నాయని సీనియర్ రాజకీయ విశ్లేషకులొకరు నాతో చెప్పారు’’ అంటూ ట్వీట్లు చేశారు.
   
అక్కడితో ఆగని ఆయన తనకు మీడియా బలం లేదని.. అయినా, కాన్షీరాం మాదిరిగా ఒంటరి పోరాటం చేసి గెలుస్తానని చెప్పుకొచ్చారు. ‘‘పోరాటం చేయడానికి ఒక పత్రిక - టీవీ ఛానల్ ఉంటే బాగుండునని అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం గారి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. ఆయన సొంత పత్రిక - ఛానల్ లేకుండానే పోరాటం చేశారు. నా జనసైనికులే  నా పత్రికలు - టీవీ చానళ్ళు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, మరిన్ని ఇలాంటి కథనాలకి సిద్ధ పడాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాను.  ఈ కథనాలన్నీ ఆగిపోవాలంటే నేను ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలి తప్ప సొంతంగా పోటీ చేయకూడదనేది వారి అభిమ‌తం. రాజకీయ చదరంగంలో నేనో చిన్న పావుని కావచ్చు. కానీ పాతుకుపోయిన ఆ రాజ‌కీయ శ‌క్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే...  నేనొక సైనికుణ్ణి. పోరాడేందుకు ఎపుడూ సిద్దం’’ అంటూ ఇంకో ట్వీట్లో పవన్ చెప్పారు.
   
పవన్ త్వరలో మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలోనే ఆయన ఈ ట్వీట్లు చేశారు. తాను ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని చెప్పడమే ఉద్దేశంగా ట్వీట్లు చేశారు. అయితే.. ఎన్నికల తరువాత ఎవరితో కలుస్తారో కూడా ట్వీట్ చేస్తే బాగుండేదంటున్నారు ఆయన విమర్శకులు.
Tags:    

Similar News