వారు పార్టీలోకి రావొద్దు.. కుల రాజకీయం చేస్తే 40 సీట్లు వచ్చేవి: పవన్ కీలక వ్యాఖ్యలు

Update: 2022-08-15 13:47 GMT
రోటీన్ రాజకీయ నేతలకు భిన్నంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఉంటున్నాయి. సినిమాల్లో పవర్ ఫుల్ పంచ్ డైలాగులు చెప్పే ఆయన.. రియల్ లైఫ్ లో మాత్రం అందుకు భిన్నంగా ఆచితూచి మాట్లాడటమే కాదు.. ఇప్పటి దూకుడు రాజకీయాల్లో ఇంత జాగ్రత్తగా వ్యవహరించే రాజకీయ అధినేతలు ఉంటారా? అన్న భావన కలిగేలా చేస్తుంటారు. ఆయన ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల ఫలితాల మీదా కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను కులం చూసుకొని రాజకీయం చేస్తే 40 సీట్లు వచ్చేవన్న ఆయన.. వైసీపీ నేతలు వారి భావాల్ని తమపై రుద్దటం సరికాదన్నారు. ఓట్ల కోసం మత రాజకీయాల్ని చేయటం సరికాదన్నారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి అవసరమన్నారు. తాను ఎంపీ కావాలని అనుకున్నట్లైతే.. కొన్నేళ్ల క్రితమే తాను ఎంపీని అయి ఉండేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు వ్యక్తిగతమైన ఆశలు.. భవిష్యత్తుపై భయాలు కానీ లేవన్నారు. పదవి వెతుక్కుంటూ రావాలే కానీ.. దాని వెంట పడకూడదన్న ఆయన.. పదవి అనేది ప్రయాణంలో భాగంగా రావాలన్నారు.

అద్భుతాలు జరుగుతాయని తాను పార్టీ పెట్టలేదన్న పవన్.. ఒక్క ఎలక్షన్ కోసమే అయితే పార్టీలోకి రావొద్దంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక తరానికి బాధ్యత గుర్తు చేయటానికి.. మరో తరాన్ని మేల్కొపటానికి తాను పార్టీ పెట్టినట్లు వెల్లడించారు. అనుభవం లేకుండా పదవులు వస్తే వైసీపీ ప్రభుత్వం మాదిరే ఉంటుందంటూ పవన్ పంచ్ లు వేశారు.

మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలన్నఆయన.. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అవసరమన్నారు. తాము అధికారంలోకి వస్తే వ్యవస్థల్ని బలోపేతం చేస్తానని చెప్పారు. వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారో తనకు తెలుసని.. మభ్య పెట్టి రాజకీయాలపై ప్రజల్లో మార్పు రాకపోతే చేసిందేమీ లేదన్నారు చొక్కా పట్టుకొని అడిగే విధానం ప్రజల్లో నుంచి రావాలన్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ కార్యకర్తలు.. నేతలపైన అదే పనిగా కేసులు నమోదు చేస్తే.. భవిష్యత్తులో వారిపై అలాంటివే ఉంటాయంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేశారు. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారన్న పవన్.. విశాఖను కాలుష్యం నుంచి కాపాడటమే తమ పార్టీ బాధ్యతగా వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News