పవన్‌ కల్యాణ్‌ మరో జేపీ!

Update: 2015-07-07 17:32 GMT
జన సేన అధ్యక్షుడు, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మీద చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆయన ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడు అవుతారని.. త్వరలోనే నవ్యాంధ్రకు మరో ఆశాదీపం అవుతారని రకరకాలుగా ఆశలు పెట్టుకున్నారు. 2019 ఎన్నికల నాటికి బీజేపీ ఆయనను పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకు వస్తుందని, అప్పుడు ఆయన బీజేపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారని, చిరంజీవి కాలేకపోయినా తమ సామాజిక వర్గం తరఫున ఆయన ముఖ్యమంత్రి అవుతారని పలువురు ఎదురు చూస్తున్నారు. కానీ, పవన్‌ కల్యాణ్‌ నాయకుడు కాలేడని, ఆయన మరో జయపక్రాశ్‌ నారాయణ అవుతాడని విశ్లేషకులు వివరిస్తున్నారు.

అందరూ కావాలి.. అందరూ తనను మంచిగా అనుకోవాలి అనుకునేవాడు నాయకుడు కాలేడు. ఒక ప్రాంతంలో తన ప్రయోజనాల కోసం మరొక ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టేవాడు నాయకుడు కాలేడు. గోడ మీద పిల్లి వాటంలా మాట్లాడేవాడు నాయకుడు కాలేడు. ఈ విషయాలు తెలంగాణ ఉద్యమ సమయంలో అందరికీ కళ్లకు కట్టినట్లు రుజువయ్యాయి. తెలంగాణ విషయంలో చంద్రబాబు నాయుడు ఏదో ఒక నిర్ణయం పూర్తిగా తీసుకునే వరకూ ఆయనను ఎవరూ విశ్వసించలేదు. జై సమైక్యాంధ్ర అనేవరకూ జగన్‌ ఆ ప్రాంతంలో అందరికీ నాయకుడు కాలేకపోయాడు. సీమాంధ్రా మాకే కావాలి.. తెలంగాణా మాకే కావాలి అనుకున్నవాళ్లు ఎక్కడా కాకుండా పోయారు. ఇటువంటి వాళ్లలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ ఒకరు.

నిన్న మొన్నటి వరకు పవన్‌ కల్యాణ్‌ మీద సీమాంధ్రులు కొండంత ఆశ పెట్టుకున్నారు. కానీ, సోమవారం ఆయన వ్యాఖ్యలు చూసినవాళ్లు ఆయనపైనా ఆశలు వదిలేసుకున్నారు. తెలంగాణ విషయంలో సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆంధ్రా ప్రాంత ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాడని, హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేసీఆర్‌ ప్రాపకం కోసం ప్ర్రయత్నించాడని ఆయననను విమర్శిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ఆయన తెలంగాణకు అనుకూలంగా మాట్లాడినా.. ఇద్దరు ముఖ్యమంత్రులను తప్ప మిగిలిన వారిని తప్పుబట్టినా సీమాంధ్రలోని నాయకులూ ఆయనను విమర్శిస్తున్నారు. తెలంగాణలోని నాయకులూ ఆయనను తిడుతున్నారు. ఏడాదికోసారి వచ్చే సినిమా గురించి ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయనను కూరలో కరివేపాకు కంటే హీనంగా తీసిపారేశారు. ఒక నిర్ణయం తీసుకోలేని.. ఒక మాట మీద నిలబడలేని వ్యక్తికి ఎదురయ్యే పరాభవమే ఇది. ఇదే తరహాలో కొనసాగితే ఆయన రాజకీయ భవిష్యత్తు మరింత దుర్భరంగా మారనుందని విశ్లేషకులు వివరిస్తున్నారు.

Tags:    

Similar News