సోము వీర్రాజు వ్యాఖ్యలకు ఒక్క నవ్వుతో తేల్చేసిన పవన్

Update: 2022-05-09 07:30 GMT
రోటీన్ గా కనిపించే రాజకీయ నాయకులకు కాస్త భిన్నంగా వ్యవహరిస్తుంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కొన్ని సందర్భాల్లో ఎంత గంభీరంగా ఉంటారో.. మరికొన్ని సందర్భాల్లో కాలేజీ కుర్రాడి మాదిరి ఆయన కనిపిస్తారు. మాంచి మూడ్ లో ఉన్నప్పుడు చిన్న పిల్లాడి మాదిరి.. తన భావోద్వేగాల్ని బయటపెట్టేస్తుంటారు తప్పించి.. దాచి పెట్టుకోవాలన్న ఆలోచనలో ఆయనలో కనిపించదు. ఈ కారణంగానే ఆయన మిగిలిన రాజకీయ నేతల మాదిరి కనిపించరు.

ఏపీలో ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలు రైతుల కుటుంబాల్ని ఆదుకోవటానికి వీలుగా పెద్ద ఎత్తున సాయం చేస్తున్న ఆయన.. ఈ కార్యక్రమాల్లో భాగంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సొంత డబ్బుల్ని సాయంగా అందిస్తున్న పవన్ కు దక్కాల్సినంత మీడియా కవరేజ్ దక్కటం లేదన్న విమర్శ ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వనని పవన్ మాటపై ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య గురించి తెలిసిందే.

ఎన్నికల్లో టీడీపీకి పొత్తుకు వ్యతిరేకమని సోము వీర్రాజు చెప్పారని.. దానిపై స్పందించాలని పవన్ ను కోరినప్పుడు..ఆయన స్పందించిన తీరు.. ఆయన ఎక్స్ ప్రెషన్స్ బోలెడన్ని మాటల్ని చెప్పకనే చెప్పేసిందని చెప్పాలి.

టీడీపీతో పొత్తుకు వ్యతిరేకమని సోము వ్యాఖ్యానించారన్న మాటకు పవన్ ఫక్కున నవ్వేయటమే కాదు.. తన రెండు చేతుల్ని ముఖానికి అడ్డు పెట్టుకొని నవ్వు ఆపుకోవటం గమనార్హం. 'ఆయన అన్నారా?' అని పవన్ ప్రశ్నించగా.. ఆయన అన్నారని మీడియా ప్రతినిధులు సమాధానం ఇవ్వటంతో తనకు తెలీదన్న విషయాన్ని చెబుతూనే.. ఇప్పటి వరకు బీజేపీతోనే తమకు పొత్తు ఉందన్నారు.
Read more!

భవిష్యత్తు అంటూనే.. తన మాటను మార్చిన పవన్.. 2014 నుంచి తాను మోడీని ఎంతలా అభిమానిస్తానన్న విషయాన్ని పేర్కొన్నారు. మోడీ అంటే తనకు చాలా గౌరవమన్నారు.అమరావతి గురించి అమిత్ షాతో తాను చాలాసార్లు మాట్లాడానని.. తాను చెప్పిన వాటికి ఒప్పుకున్నారన్నారు.

ఏపీ భవిష్యత్తును కేంద్ర నాయకుల వద్దకు తీసుకెళతానని.. మిత్రపక్షమే కాదు.. నన్ను వ్యక్తిగతంగా ఇష్టపడే అగ్రనాయకులకు తాను అనుకుంటున్న విషయాన్ని తెలియజేస్తానని చెప్పారు. ఏపీ భవిష్యత్తు ఇలా ఉంది? అప్పులు ఇన్ని ఉన్నాయి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కాగ్ తిట్టి పోస్తోందన్న విషయంతో పాటు.. వెల్ఫెర్ స్కీం పేరుతో డబ్బులు వెళ్లిపోతున్నాయన్న విషయాల్ని వారి ముందు ఉంచుతానని చెప్పారు. ఏమైనా.. సోము వీర్రాజు వ్యాఖ్యల్ని తాను ఎంత సీరియస్ గా తీసుకుంటానన్న విషయాన్ని పవన్ తన నవ్వుతో చెప్పేశారని చెప్పాలి.
Tags:    

Similar News