క్రికెట్ జట్లూ.. షోయబ్ మాటలు వినాల్సిందే!

Update: 2016-10-27 06:42 GMT
పాకిస్థాన్ లో క్రికెట్ ఆడదామని పెద్దమనసుతోనో పరిస్థితుల ప్రభావంలోనో బయలుదేరిన శ్రీలంక క్రికెటర్లపై దాడులు జరిగాయి. ఒక్కసారిగా ప్రపంచం - క్రికెట్ ప్రపంచం ఉలిక్కిపడ్డాయి. దాంతో పాకిస్థాన్ లో క్రికెట్ ఆడటానికి వెళ్లడం అంటే... అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదనే స్థాయికి పరిస్థితులు వెళ్లిపోయాయి. ఆ క్రమంలో ఇప్పటికీ పాకిస్థాన్ లో క్రికెట్ ఆడటానికి విదేశీ జట్లు వెనకడుగు వేస్తున్న సమయం ఎప్పుడో వచ్చేసింది. ఈ సమయంలో మరేదేశమైనా పెద్ద మనసుతో పాక్ వెళ్లి క్రికెట్ ఆడాలని భావిస్తే... తాజాగా షోయబ్ చేసిన మాటలు వినాల్సిందే!!

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ - రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ తమ దేశంలో క్రికెట్ ఆడటం పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ లో క్రికెట్ ఆడటం ఎంతమాత్రం సురక్షితం కాదని తేల్చిచెప్పాడు. ఈ మేరకు పాక్ కు విదేశీ జట్లు రావొద్దని హెచ్చరికలు కూడా జారీ చేశాడు. తాజాగా క్వెట్టాలోని పోలీస్ శిక్షణా శిబిరంపై ఉగ్ర మూకలు నరమేధం సృష్టించి 60కి పైగా పోలీస్ క్యాడెట్ల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన అక్తర్... తమ దేశంలో సరైన రక్షణ లేదనే విషయాన్ని అంగీకరించాడు.

తమ దేశంలో సరైన భద్రత లేదని.. ఇక్కడకు రావాలను కోవడం విదేశీ జట్లకు ఏమాత్రం సురక్షితం కాదని.. పాకిస్తాన్ లో పరిస్థితులు చక్కబడేవరకూ ఏ జట్టు ఇక్కడకు రావడం అంత శ్రేయస్కరం కాదని.. తమ దేశంలో విదేశీ క్రికెట్ జట్లు పర్యటించడానికి కొంత సమయం చాలా అవసరం అని అక్తర్ పేర్కొన్నాడు. ఇదే క్రమంలో తమ దేశంలో ఉగ్రదాడులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడకు రావాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) విదేశీ జట్లను ఆహ్వానించడం దురదృష్టకరమని షోయబ్ కుండబద్దలు కొట్టేశాడు. దీంతో పాక్ లో ఉన్న పరిస్థితులు మరోసారి ప్రపంచానికి పాక్ జాతీయుడి ద్వారానే తెలిసాయి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News