కొత్త కోటీశ్వ‌రుల బ‌య‌ట‌కు వ‌స్తున్నారు

Update: 2017-12-21 04:57 GMT
దేశంలో ఎంత‌మంది కోటీశ్వ‌రులు ఉంటారు అన్న ప్ర‌శ్న‌కు అధికారికంగా వ‌చ్చే స‌మాధానం వింటే అవాక్కు అవ్వాల్సిందే. ఇంకాస్త స్ప‌ష్టంగా చెప్పాలంటే.. ఏడాదికి కోటికి పైనే ఆదాయం ఉన్నోళ్లు ఎంత‌మంది అన్నది ప్ర‌శ్న‌. అంటే నెల‌కు ఎనిమిది ల‌క్ష‌ల చిల్ల‌ర‌న్న మాట‌.

ఈ ప్రశ్న‌కు అధికారికం స‌మాచారాన్ని ఆధారంగా తీసుకుంటే.. 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రానికి త‌మ వార్షిక ఆదాయం కోటికి మించి ఉంద‌ని చెప్పినోళ్ల సంఖ్య అక్ష‌రాల 59,830 మంది మాత్ర‌మే. దీని రాష్ట్రాల వారీగా లెక్కేస్తే కేవ‌లం 1500 మంది కంటే త‌క్కువ ఉన్న‌ట్లుగా క‌నిపిస్తుంది. ఒక రాష్ట్రంలో కోటి వార్షికాదాయం ఉండేవారు 1500 మందేనా? అన్న ప్ర‌శ్న వేసుకుంటే స‌మాధానం వ‌చ్చేస్తుంది.

దేశ వ్యాప్తంగా ఉండే  రాజ‌కీయ నాయ‌కులు.. కార్పొరేట్ ప్ర‌ముఖులు.. ఉద్యోగులు.. వ్యాపారులు.. ఇత‌ర సేవా రంగాల్లోనూ.. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఉండే వారు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే క‌నిపిస్తారు. కానీ.. అధికారిక రికార్డుల్లో మాత్రం కోటి రూపాయిల వార్షికాదాయం వ‌స్తున్న వైనాన్ని ఒప్పుకోని వారే క‌నిపిస్తారు.

దేశం దాకా ఎందుకు? మ‌నం ఉండే ఊళ్లో.. మ‌న చుట్టూ ఉండే వారిలో ఏడాదికి కోటి రూపాయిలు సంపాదించే వారు ఎంతోమంది క‌నిపిస్తుంటారు. ఇదొక్క‌టి చాలు ఆదాయ‌ప‌న్ను ఎగ‌వేత ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. మోడీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన త‌ర్వాత పెద్ద‌నోట్ల ర‌ద్దు కావొచ్చు.. బ్యాంకు అకౌంట్లు మొద‌లు.. పాన్ కార్డు మొద‌లు..అన్ని కార్య‌క‌లాపాల‌కు ఆధార్ లింక్ చేస్తున్న నేప‌థ్యంలో ఎవ‌రి వార్షికాదాయం ఎంత‌న్న విష‌యం ఇట్టే తెలిసిపోయే ప‌రిస్థితులు నెమ్మ‌ది నెమ్మ‌దిగా చోటు చేసుకుంటున్నాయి.

ప్ర‌భుత్వ ప‌రంగా ఎవ‌రి ఆదాయం ఎంత‌న్న విష‌యంపై డేగ‌క‌న్ను ప‌డుతుంద‌న్న విష‌యాన్ని కోటీశ్వ‌రులు గుర్తించిన‌ట్లున్నారు. అందుకే కాబోలు ఎప్పుడూ లేని రీతిలో ఈఏడాదిలో కోటీశ్వ‌రుల సంఖ్య పెరిగిపోయింది. ఈ గ‌ణాంకాలు అంత‌కు ముందు ఏడాది ప్ర‌క‌టించిన దాని కంటే ఎక్కువ‌గా ఉండ‌టం క‌నిపిస్తుంది. అయితే.. ఇలా ప్ర‌క‌టించిన లెక్క‌ల‌కు సంబంధించి కూడా లోపాలు చాలానే క‌నిపిస్తాయి. త‌మ ఏడాది ఆదాయం కోటి కంటే ఎక్కువ‌ని చెప్పిన సంపాద‌న‌ప‌రులు వెల్ల‌డించిన ఆదాయం రూ.2.05 కోట్లు మాత్ర‌మే. అంటే స‌రాస‌రి కోటీశ్వ‌రులుగా ఒప్పుకున్న వారిలో త‌మ వార్షిక ఆదాయం స‌రాస‌రిన రూ.3 కోట్లుగా మాత్ర‌మే చెప్పార‌ని చెప్పాలి. కాకుంటే గ‌తంలో పోలిస్తే.. ఇప్పుడిప్పుడే కోటీశ్వ‌రులు త‌మ ఆదాయాన్ని ఓపెన్ చేయ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే..  2015-16 మ‌దింపు ఏడాదిలో త‌మ ఆదాయం రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల మ‌ధ్య ఉన్న వారి సంఖ్య 31కి చేరింది. అంత‌కు ముందు ఏడాదిలో ఈ సంఖ్య కేవ‌లం 17 మంది మాత్ర‌మే ఉండేవారు. ఇక‌.. త‌మ వార్షిక ఆదాయం రూ.500 కోట్ల‌కు పైనే అని ప్ర‌క‌టించిన వారు దేశ వ్యాప్తంగా ఏడుగురు మాత్ర‌మే కావ‌టం విశేషం. ఇక‌.. రూ.500 కోట్ల‌కు మించి త‌న వార్షిక ఆదాయం ఉంద‌ని ప్ర‌క‌టించింది ఒకే ఒక్క‌రు మాత్ర‌మే. స‌ద‌రు పెద్ద‌మ‌నిషి త‌న వార్షిక ఆదాయం రూ.721 కోట్లుగా ప్ర‌క‌టించారు.

శ్లాబుల వారీగా ఆదాయ‌ప‌న్నును వెల్ల‌డించిన‌వారిని చూస్తే.. 0-2.5ల‌క్ష‌ల లోపు త‌మ ఆదాయం ఉంద‌ని పేర్కొన్న వారు 130 కోట్ల‌లో కేవ‌లం 82 ల‌క్ష‌లు మాత్ర‌మే. అంటే.. నెల‌కు రూ.20వేల‌కు పైనే. ఇక‌.. ఏడాదికి రూ.2.5-3.5ల‌క్ష‌లు అని ప్ర‌క‌టించిన వారు 1.33 కోట్ల మంది కాగా.. కోటి నుంచి రూ.5కోట్ల ఆదాయం ఉంద‌ని చెప్పిన వారు 55,331 మంది మాత్ర‌మే. ఇక‌.. రూ.5 నుంచి రూ.10 కోట్ల వ‌ర‌కు ఆదాయం ఉంద‌ని చెప్పిన వారు 3,021 అయితే.. రూ.10 కోట్ల నుంచి రూ.25 కోట్ల వ‌ర‌కు ఆదాయం ఉన్న వారు 1156 మందిగా వెల్ల‌డైంది.

నిజానికి ఈ గ‌ణాంకాల్ని చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. వ్య‌క్తులు వెల్ల‌డించే వార్షికాదాయం మీద  ప్ర‌భుత్వాలు మ‌రింత ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు చేప‌డితే మ‌రింతమంది బ‌య‌ట‌కు వ‌చ్చే వీలుంది. అయితే.. ఇలాంటి ప‌రిస్థితికి వ్య‌క్తులు మాత్ర‌మే కాదు.. ప్ర‌భుత్వాలు కూడా కార‌ణంగా చెప్పాలి.

ఆదాయ‌ప‌న్ను విధించే తీరులోనూ లోపాలు ఉన్నాయ‌ని చెప్పాలి. సంపాద‌న అంత తేలిగ్గా రాదు. చాలా క‌ష్ట‌ప‌డాలి. మ‌రి.. అంత క‌ష్ట‌ప‌డి సంపాదించిన త‌ర్వాత వ‌చ్చిన ఆదాయాన్ని ప‌న్ను రూపంలో భారీగా ప్ర‌భుత్వానికి చెల్లించాలంటే ఇబ్బందే. అదే.. ఆదాయ‌ప‌న్ను శ్లాబు క‌నీసంగా ఉంటే.. ఎక్కువ‌మంది ఓపెన్ అయి.. త‌మ ఆదాయాన్ని వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి. అయితే.. ఈ విష‌యం మీద ఇప్ప‌టికే ఎంతో చ‌ర్చ జ‌రిగినా.. నిపుణులు సూచ‌న‌లు చేసినా ప్ర‌భుత్వాలు మాత్రం తమ తీరు మార్చుకోని ప‌రిస్థితి క‌నిపిస్తుంది.  ఏమైనా.. తాజాగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల పుణ్య‌మా అని..  కోటీశ్వ‌రులు  తమ ఆదాయాన్ని త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో వెల్ల‌డిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే.. అది కూడా పూర్తిస్థాయిలో కాద‌న్న వాస్త‌వాన్ని గుర్తించాలి.
Tags:    

Similar News