ఓటుకు నోటు మూసేసినట్లేనా!?

Update: 2015-07-01 17:30 GMT
ఓటుకు నోటు కేసు ఇక ముందుకు కదలదా!? అనధికారికంగా దానిని మూసేసినట్లేనా!? ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదం మెడకు చుట్టుకుంటుందని భయపడి.. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గిందా!? ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించిందా? ఈ ప్రశ్నలు అన్నిటికీ ఔను అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

స్టింగ్‌ ఆపరేషన్‌ కేసులో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక తెలంగాణ ఏసీబీకి శుక్రవారం అందింది. సోమ, మంగళ, బుధ వారాలు గడిచినా దానిపై ఎటువంటి చర్యలూ లేవు. మంగళవారం రేవంత్‌కు బెయిలు కూడా వచ్చింది. అంతకుముందు మంగళవారం ఉదయాన్నే సీఎం కేసీఆర్‌ను ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ కలిశారు. తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని పదేళ్లుగా ఆస్పత్రిలో ఉన్నానని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఏసీబీకి సమాచారం పంపించారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చంటూ టీడీపీ యువ నాయకుడు లోకేశ్‌ మరింత రెచ్చగొడుతున్నారు.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేసినట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదం మెడకు చుట్టుకోకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఒక అడుగు వెనక్కి వేసిందని వివరిస్తున్నారు. ఇకనుంచి ఓటుకు నోటుకు సంబంధించి కొన్ని చిన్న చిన్న పరిణామాలు జరిగినా అవన్నీ ప్రజలు మభ్యపెట్టడానికేనని, నిజంగా ఈ కేసులో ముందుకు వెళ్లే అవకాశం ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాల్సిందే!!



Tags:    

Similar News