తొలిరోజున సామాన్యులే కాదు.. ప్రముఖులు పలువురు టీకా వేయించుకున్నారు

Update: 2021-01-17 03:55 GMT
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. వైద్యులు.. వైద్య సిబ్బంది.. ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే పరిమితం చేస్తూ.. ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును అందరూ పాటించారు. చాలా కొద్ది మంది మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. అయితే.. వ్యాక్సిన్ మీద నెలకొన్న సందేహాలు.. భయాల్ని పక్కన పెడుతూ.. కొందరు ప్రముఖులు వ్యాక్సిన్ వేయించుకోవటం గమనార్హం.

అలాంటివారిలో న్యూఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా టీకా వేయించుకుున్నారు. అంతేకాదు.. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్.. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాపరెడ్డి.. ప్రముఖ ఈఎన్ టీ సర్జన్ మోమన్ కామేశ్వరన్.. ఏంజీఆర్ మెడికల్ వర్సిటీ వీసీ సుధా శేషయ్యన్ కూడా టీకాలు వేసుకున్న వారిలో ఉన్నారు.

అయితే.. తొలి రోజు వ్యాక్సిన్ వేయించుకున్న ప్రముఖుల్లో అత్యధికులు వైద్య రంగానికి చెందిన వారే ఉన్నారు. ఒక విధంగా వీరు ముందుకు రావటం కోట్లాది మందిలో వ్యాక్సిన్ మీద నమ్మకంతో పాటు భరోసా కలగటానికి అవకాశం ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే.. వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందు పేర్లు ఇచ్చిన పలువురు.. తీరా వ్యాక్సిన్ వేయించుకునే సమయానికి వెనక్కి తగ్గిన పరిస్థితి. దీంతో.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ.. టీకా వేయించాల్సి వచ్చింది.

ఇలాంటి వేళ.. వైద్య రంగానికి సంబంధించిన ప్రముఖులు తమకు తాముగా వ్యాక్సిన్ వేయించుకోవటం ద్వారా.. ప్రజలకు సరైన సందేశాన్ని ఇచ్చినట్లైందని చెప్పాలి. దీనికి తగ్గట్లే మరికొందరు ప్రముఖులు కూడా టీకా వేయించుకున్న వారిలో ఉన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు కేతన్ దేశాయ్.. యూపీలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ ఆర్కే ధీమాన్.. రాం మనోహర్ లోహియా ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ ఏకే సింగ్ లు ఉన్నారు.
Tags:    

Similar News