2025లో అవినీతిపై గట్టి దెబ్బ: తెలంగాణ ఏసీబీ అద్భుత ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన దిశగా 2025 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది.;
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన దిశగా 2025 సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచింది. యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ఈ ఏడాది ప్రదర్శించిన దూకుడు.. అవినీతి తిమింగాల గుండెల్లో వణుకు పుట్టించాడు. గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 199 అవినీతి కేసులు నమోదు చేసింది. సగటున ప్రతి రెండు రోజులకు ఒక అవినీతి కేసు నమోదు చేస్తూ.. ఈ కేసుల్లో 273 మందిని అరెస్ట్ చేయడం.. వ్యవస్థను ప్రక్షాలన చేయడంలో ఏసీబీ అద్భుతమైన పనితీరు కనబరిచింది.
ట్రాప్ కేసుల్లో అధిక భాగస్వామ్యం..
అవినీతిని అడ్డుకునే ప్రధాన ఆయుధమైన ట్రాప్ కేసులు ఈ ఏడాది అత్యధికంగా నమోదయ్యాయి. మొత్తం 157 ట్రాప్ కేసుల్లో లంచం తీసుకుంటూ పట్టుబడిన 224 మంది అరెస్ట్ అయ్యారు. వీరిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం గమనార్హం. ఈ ఆపరేషన్లలో రూ.57 లక్షలకు పైగా లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.
ఆస్తుల దర్యాప్తులోనూ షాకింగ్ నిజాలు
అవినీతితో కూడిన సంపాదనపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. అనుపాతరహిత ఆస్తుల కేసులు 15 నమోదు చేసి అందులో రూ.96.13 కోట్ల విలువైన ఆస్తులు వెలుగులోకి తీసుకొచ్చింది. ఇది పెద్ద స్థాయి అవినీతిని బయటపెట్టిన కీలక విజయం.
అధికారుల దుర్వినియోగంపై చర్యలు
ఇంకా 26 తీవ్రమైన దుర్వినియోగ కేసులు నమోదు చేయగా.. అందులో 34 మంది అరెస్ట్ అయ్యారు. అవినీతిని ముందే అడ్డుకునే లక్ష్యంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. ఆర్టీఏ చెక్ పోస్టులు, సంక్షేమ హాస్టళ్లు వంటి చోట్ల 54 సడెన్ చెక్స్ నిర్వహించారు.
న్యాయ ప్రక్రియలో వేగం..
కేసులపై న్యాయపరమైన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 115 కేసుల్లో నిందితులపై కేసులు నడిపేందుకు ప్రభుత్వ అనుమతి పొందగా.. సంబంధిత చార్జ్ షీట్లు దాఖలు చేశారు.
ఆధునిక శిక్షణ, టెక్నాలజీ వినియోగం..
ఏసీబీ సిబ్బంది సామర్థ్యాన్ని పెంచేందుకు 73 మంది కొత్త అధికారులకు శిక్షణ ఇచ్చారు. దాని ఉన్న ఆస్తుల గుర్తింపు.. మనీ ట్రైల్స్ ట్రాకింగ్, డిజిటల్ ఆధారాల వినియోగం వంటి ఆధునిక పద్ధతులపై ప్రత్యేక శిక్షణ అందించారు.
ప్రజలకు చేరువైన ఫిర్యాదు వ్యవస్థ
అవినీతి ఫిర్యాదులు సులభంగా నమోదు చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ 3-9 మధ్య నిర్వహించిన యాంటీ కరప్షన్ వీక్ సందర్భంగా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫిర్యాదు వ్యవస్థను ప్రారంభించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మధ్యవర్తులు లేకుండా సురక్షితంగా ఫిర్యాదు చేయవచ్చు. అదనంగా పోస్టర్లు , విద్యార్థుల కోసం వ్యాసపోటీలు .. ర్యాలీలు, బహుమతి పంపిణీ కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచారు. పౌరులు ట్రోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్, లేదా నేరుగా ఏసీబీ కార్యాలయాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.
ఈ విజయాల వెనుక చారుసిన్హా, ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ గా ఉన్న ఏసీబీ బృందం నిబద్దత స్పష్టంగా కనిపిస్తోంది. 2025లో సాధించిన ఈ ఫలితాలు తెలంగాణలో అవినీతికి తావులేని పారదర్శక పాలన దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తోందని స్పష్టంగా సూచిస్తున్నాయి.