బాలీవుడ్ సినిమాలో సీన్ కాదు.. రియల్ గా జరుగుతన్నది ఇదే

Update: 2020-10-03 07:15 GMT
బాలీవుడ్ లో అప్పుడప్పడు కొన్ని సినిమాలు వస్తుంటాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చే ఈ సన్నివేశాల్ని చూస్తే..నిజంగా ఇలా జరుగుతుందా? అన్న సందేహం కలుగక మానదు. దేశంలో మరెక్కడా లేనన్ని ఆంక్షలు ఇప్పుడు హాథ్రస్ బాలిక ఊరిలో నడుస్తోంది. ఏదైనా సంచలన ఘటన జరిగినప్పుడు మీడియా ఎంట్రీ ఇవ్వటం.. అక్కడి ఏం జరిగిందన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పటం మామూలే.

అందుకు భిన్నంగా హాథ్రస్ బాలిక ఊళ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. బాలీవుడ్ సినిమాను తలపించేలా ఉంటాయని చెప్పాలి. హాథ్రస్ బాలిక కుటుంబాన్ని మరెవరూ కలవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు యూపీ పోలీసులు. దీంతో.. అసలేం జరిగింది? ఏం జరుగుతోందన్న విషయాల్ని తెలుసుకునేందుకు మీడియా తెగ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబం ఒక చిన్న కుర్రాడ్ని ఊరి బయట ఉండిపోయిన మీడియా ప్రతినిధులకు సమాచారం అందించేందుకు ఒక ఫోన్ ఇచ్చి పంపారు.

సదరు కుర్రాడు.. పొలాల్లో నక్కుతూ మీడియా ప్రతినిధులు ఉన్న దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశాడు. మధ్యలోనే అతడ్ని పోలీసులు గుర్తించారు. దీంతో.. ఊళ్లోకి పారిపోయాడు. తర్వాత.. మరో ప్రయత్నంలో ఎట్టకేలకు మీడియా వద్దకు చేరుకున్న బాలుడు.. ఊళ్లో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు.. బాలుడ్ని మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో మీడియాకు పోలీసులకు మధ్య తీవ్రమైన వాదన జరిగింది. ఒక సంచలన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు బయటకు సమాచారం రాకుండా ఉండేందుకు ఇంతలా శ్రమించాలా? అన్న సందేహం రాక మానదు. బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే కొన్ని సీన్లు.. హాథ్రస్ గ్రామంలో ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News