అక్కడ ఆల్ ఫ్రీ అంటున్న బీజేపీ !
ఏపీలో 2024 ఎన్నికల్లో కూటమి ఉమ్మడి మానిఫేస్టో రిలీజ్ సందర్భం గుర్తుందా.;
ఏపీలో 2024 ఎన్నికల్లో కూటమి ఉమ్మడి మానిఫేస్టో రిలీజ్ సందర్భం గుర్తుందా. ఆ సమయంలో కూటమిలోని మూడు పార్టీలూ కలిసి మేనిఫేస్టో రిలీజ్ చేయాలనుకుంటే బీజేపీ ప్రతినిధి వేదిక మీద ఉండి కూడా మేనిఫేస్టోని టచ్ చేయకుండా దూరంగా ఉండిపోయారు. దానికి కారణం ఉచిత పథకాలు ఉన్నాయన్న ఆలోచనతోనే అని ప్రచారం సాగింది. సూపర్ సిక్స్ అంటూ ఆనాడు కూటమి ఇచ్చిన హామీలతో తమకు సంబంధం లేనట్లుగా బీజేపీ నేతలు వ్యవహరించారు అని విమర్శలు కూడా వచ్చాయి. దాంతో చంద్రబాబు పవన్ కలసి కూటమి మేనిఫేస్టోని రిలీజ్ చేశారు. ఆ తరువాత ఆ హామీలను నెరవేర్చే పనిలో ఏపీ ప్రభుత్వమే మల్ల గుల్లాలు పడుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా పెద్దగా ఆర్థిక సాయం అయితే లేదు అన్నది అంతా అంటున్న విషయం.
బెంగాల్ లో మాత్రం :
అయితే బీజేపీ ఫిలాసఫీ విషయంలో ఆ పార్టీ నేతలు చాలా చెప్పుకొస్తూ ఉంటారు. ఉచిత పధకాల మీద బీజేపీకి నమ్మకం లేదని అభివృద్ధి మాత్రమే అజెండా అని అంటూంటారు. కానీ ఏపీ తప్ప చాలా రాష్ట్రాలలో జరిగే ఎన్నికల సందర్భంగా బీజేపీ రిలీజ్ చేసే మేనిఫేస్టోలో మాత్రం ఉచిత పధకాలు అనేకం కనిపిస్తాయి. తాజాగా ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ కి సంబంధించి బీజేపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫేస్టోలో చూస్తే ఏ ఇతర ప్రాంతీయ పార్టీకీ తీసిపోని విధంగా ఉచిత పధకాలతో మొత్తం నింపేశారు.
నిరుద్యోగ భృతి అంటూ :
ఏపీలో కూటమి ప్రభుత్వం నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ప్రకటించింది. మరి రెండేళ్ళు గడుస్తున్నా ఇది అమలు కావడం లేదని విమర్శలు ఉన్నాయి. దీని మీద పెద్దగా మాట్లాడని బీజేపీ బెంగాల్ లో మాత్రం తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అంతే కాదు మహిళలకు ప్రతీ నెలా మూడు వేల రూపాయలు ఆర్ధిక సాయంగా ఇస్తామని మరో హామీని ఇచ్చింది. అయిదేళ్ళలో కోటి కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, స్వయం ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీలు గుప్పించింది. మహిళల కోసం ప్రత్యేక పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపు వంటివి కూడా బీజేపీ హామీలలో ఉన్నాయి.
గెలుపే ప్రాతిపదికగా :
దేశంలో ఉచిత హామీల విషయంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఈ విషయంలో జోరు చేస్తున్నాయి. జాతీయ పార్టీలలో కాంగ్రెస్ ఉచిత హామీలను ఇస్తూ పోతోంది. బీజేపీ అయితే ఉచిత హామీల విషయంలో పెద్దగా నమ్మకం లేనట్లుగా వ్యవహరించింది అని చెబుతారు. అయితే తాము సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటున్న చోట మాత్రం ఉచిత హామీలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు అని అంటున్నారు. అస్సాం లోనూ అనీక హామీలు బీజేపీ ఈ విధంగా ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ లో సైతం అదే చేస్తోంది అని గుర్తు చేస్తున్నారు. మిత్రులతో పొత్తులో ఉన్న చోట మాత్రమే బీజేపీ ఉచితాల మీద అంటీ ముట్టనట్టుగా ఉంటోందని విమర్శలు వస్తున్నాయి. అయితే ఏపీ లాంటి రాష్ట్రంలో బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది. కూటమిగా ఉచిత హామీలు ఇచ్చారు. కాబట్టి బెంగాల్ కంటే ముందు ఏపీ ఉచిత హామీల మీద బీజేపీ కూడా ఫోకస్ పెట్టి కేంద్రం నుంచి ఉదారంగా నిధులు వచ్చేలా చూస్తే బాగుంటుందని అంటున్నారు.