డిజిటల్ పేమెంట్లలో భారీ మార్పు.. గంట తర్వాతే రూ. 10,000 ట్రాన్స్‌ఫర్? ఆందోళనలో యూజర్లు!
దేశంలో డిజిటల్ విప్లవం ఊపందుకున్న తర్వాత ఆర్థిక లావాదేవీలు వేగవంతమయ్యాయి. ఒక్క క్లిక్‌తో వేల రూపాయలు క్షణాల్లో అవతలి వ్యక్తి ఖాతాలోకి చేరిపోతున్నాయి.;
దేశంలో డిజిటల్ విప్లవం ఊపందుకున్న తర్వాత ఆర్థిక లావాదేవీలు వేగవంతమయ్యాయి. ఒక్క క్లిక్‌తో వేల రూపాయలు క్షణాల్లో అవతలి వ్యక్తి ఖాతాలోకి చేరిపోతున్నాయి. అయితే ఈ వేగంతో పాటే సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఒక సంచలన ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది.
ఏమిటీ కొత్త ప్రతిపాదన?
ఆర్బీఐ పరిశీలనలో ఉన్న కొత్త నిబంధన ప్రకారం ₹10,000కు పైబడిన ప్రతి ఆన్‌లైన్ పేమెంట్‌ను వెంటనే పూర్తి చేయకుండా కనీసం ఒక గంట గడువు తర్వాత మాత్రమే ప్రాసెస్ చేసేలా సాంకేతిక మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ గంట సమయాన్ని "కూలింగ్ పీరియడ్" అని పిలుస్తారు. వినియోగదారుడు పొరపాటున ఎవరికైనా డబ్బు పంపినా లేదా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి లావాదేవీ ప్రారంభించినా ఆ గంట లోపు దానిని గుర్తించి రద్దు చేసుకునే అవకాశం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాటేమిటి?
ఆర్బీఐ ప్రతిపాదన వార్తలు బయటకు రాగానే సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా వైద్య అత్యవసర పరిస్థితులు, ఆసుపత్రి బిల్లుల చెల్లింపులు, లేదా ఇతర తక్షణ ఆర్థిక అవసరాల సమయంలో ఈ 'ఒక గంట' నిరీక్షణ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "ప్రమాద సమయాల్లో లేదా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేటప్పుడు తక్షణం డబ్బు కట్టాల్సి ఉంటుంది. అప్పుడు గంట సేపు వేచి చూడాలంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?" అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
ఈ ఆందోళనల నేపథ్యంలో ఆర్థిక రంగ నిపుణులు కొంత స్పష్టతనిస్తున్నారు. ఈ నిబంధన ప్రతి లావాదేవీకి వర్తించకపోవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. మీరు మొదటిసారి ఒక కొత్త వ్యక్తికి లేదా కొత్త ఖాతాకు ₹10,000 కంటే ఎక్కువ పంపినప్పుడు మాత్రమే ఈ నిబంధన వర్తించే అవకాశం ఉంది. ఇప్పటికే మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారు లేదా గతంలో పదేపదే డబ్బులు పంపిన ఖాతాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉండవచ్చు. అత్యవసర అవసరాల కోసం బ్యాంకులు లేదా పేమెంట్ యాప్స్ గూగుల్ పే, ఫోన్ పే పేటీఎం వంటివి ప్రత్యేక ధ్రువీకరణ ఓటీపీ లేదా బయోమెట్రిక్ ద్వారా తక్షణమే పంపే వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది.
సైబర్ మోసాల నియంత్రణే లక్ష్యం
గత ఏడాది కాలంలో 'డిజిటల్ అరెస్ట్', 'ఫిషింగ్ లింక్స్', 'కస్టమర్ కేర్ ఫ్రాడ్స్' ద్వారా వేల కోట్లు నేరగాళ్ల ఖాతాల్లోకి చేరాయి. ఒక్కసారి డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగేలోపే ఆ సొమ్ము ఇతర ఖాతాల ద్వారా మాయమైపోతోంది. ఈ ఒక గంట గడువు ఉంటే బాధితుడు వెంటనే స్పందించి తన డబ్బును కాపాడుకోగలడని ఆర్బీఐ భావిస్తోంది.
ప్రస్తుతానికి ఇవి కేవలం ప్రతిపాదనలు మాత్రమే. ఆర్బీఐ త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనుంది. భద్రత, సౌలభ్యం మధ్య సమతుల్యతను ఎలా పాటిస్తారో చూడాలి. ఒకవేళ ఈ నిబంధన అమలులోకి వస్తే డిజిటల్ బ్యాంకింగ్ రంగంలో ఇది ఒక పెద్ద మైలురాయిగా మారుతుంది. కానీ ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం కలగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత.