'రాజ్యసభకు భారం కాదలుచుకోలేదు': జస్టిస్ వర్మ రాజీనామా!
దేశంలో తీవ్ర చర్చనీయాంశం.. వివాదానికి దారి తీసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు.;
దేశంలో తీవ్ర చర్చనీయాంశం.. వివాదానికి దారి తీసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది మే-డిసెంబరు మధ్య సుదీర్ఘకాలం దేశవ్యాప్తంగా జస్టిస్ వర్మ పేరు మార్మోగింది. అంతేకాదు.. వర్షాకాల పార్లమెంటు సమావేశాలపై కూడా ఆయన ప్రభావం భారీగా పడింది. జస్టిస్ వర్మను అభిశంసించాలన్న తీర్మానం కూడా.. ఉభయ సభల్లోనూ తీవ్ర కలకలం సృష్టించింది.
విషయం ఏంటి?
జస్టిస్ యశ్వంత్ వర్మ.. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటలను ఆర్పేందుకు.. అగ్నిమాపక శాఖ అదికారులు వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో సగం కాలిపోయిన 500 రూపాయల నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా పడి ఉండడాన్ని చూశారు. అనంతరం.. ఇది వార్తల్లోకి ఎక్కింది. దీంతో అవినీతి ఆరోపణలు పెల్లుబికాయి. వాస్తవ వేతనానికి.. ఆయన సర్వీసుకు.. మధ్య ఆదాయ వ్యయాలను లెక్కించగా.. అనేక అనుమానాలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే జస్టిస్ వర్మ కేంద్రంగా న్యాయవ్యవస్థపై `అవినీతి` ఆరోపణలు వచ్చాయి. దీనికి కొన్ని నెలల కిందటే.. ఓ న్యాయమూర్తిపై కూడా ఇలానే ఆరోపణలు రావడం.. జస్టిస్ వర్మ వ్యవహారంలో ఆధారాలు కూడా లభ్యంకావడంతో ఇది పెనుదుమారంగా మారింది. దీనిని విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆరోపించినా.. జస్టిస్ వర్మ అభిశంసన వ్యవహరంలో వెనక్కి తగ్గలేదు.
ఉపరాష్ట్రపతి రాజీనామా..
ఇక, అప్పటి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్.. ఆకస్మిక రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ రాజీనామాకు ఆయన అనారోగ్య కారణాలేనని చెప్పినప్పటికీ.. దీని వెనుక పార్లమెంటు రాజ్యసభలో జస్టిస్ వర్మకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ పక్ష సభ్యులు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని ఆయన అనుమతించడమేనన్న చర్చ సాగింది. అయితే.. దీనిపై కొన్నాళ్లు వివాదం కొనసాగినా.. ఇప్పటి వరకు ధన్‌ఖడ్ ఎందుకు రాజీనామా చేశారన్న అసలు కారణం గోప్యంగానే ఉంది.
ఆది నుంచి వివాదాలే..
జస్టిస్ వర్మ వ్యవహారంపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఆయన గతంలో పనిచేసిన కోర్టులోనూ ఇలాంటి ఆరోపణలే రావడంతో ఆయనను ఢిల్లీకి బదిలీచేశారని విపక్ష సభ్యుడు రాహుల్ విమర్శించారు. ఆ తర్వాత.. ఇక్కడ కూడా ఆయన అదే పనిచేశారన్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుని.. తిరిగి ఆయనను అలహాబాద్ హైకోర్టు(గతంలో పనిచేసిన చోటు)కు బదిలీ చేసి.. ఎలాంటి పనీ అప్పగించకుండా.. చేసింది.
రాజీనామా వెనుక..
చివరకు.. ఈ అభిశంసన తీర్మానం.. ఈ నెలలో ప్రత్యేకంగా జరగనున్న సభల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలియడంతో జస్టిస్ వర్మ.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి ఆయన లేఖ రాశారు. ``రాజ్యసభకు నేను భారం కాదలుచుకోలే దు`` అని ఆయన పేర్కొనడం గమనార్హం. కాగా.. ఆయనను అభిశంసిస్తే.. పింఛను, ఇతర సౌకర్యాలు సహా.. అన్నీ కోల్పోతారు. అదే రాజీనామా చేస్తే.. పింఛను, ఇతర సౌకర్యాలు లభిస్తాయి. కాబట్టి రెండో ఆప్షన్ వైపే జస్టిస్ వర్మ మొగ్గు చూపారు.