మరో కళింగ యుద్ధం...ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు
మరో కళింగ యుద్ధం వస్తుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.;
మరో కళింగ యుద్ధం వస్తుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎందుకు ఈ మాటలు అన్నారు అన్నది చూస్తే ప్రాంతీయ వివక్ష మీద అంటున్నారు. అమరావతి పేరుతోనే చంద్రబాబు మొత్తం కాలం గడిపేస్తున్నారు అని దువ్వాడ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టులో తీవ్ర విమర్శలు చేశారు. విభజన జరిగి పుష్కర కాలం గడచిందని అందులో అత్యధిక కాలం అంటే ఏడేళ్ళు సీఎం గా చంద్రబాబు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికి కూడా రాజధాని వ్యవహారం ఒక కొలిక్కి రాకపోవడం దురదృష్టకరం అన్నారు.
అత్యధిక ఖర్చుతో :
చదరపు అడుగు ఏకంగా 14 వేల రూపాయలు వెచ్చించి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలనుకోవడం ద్వారా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమ అని దువ్వాడ ఫైర్ అయ్యారు. బయట ఎక్కడైన చదరపు అడుగు నిర్మాణానికి పదిహేను వందల నుంచి రెండు వేలు మాత్రమే ఖర్చు అవుతుందని ఆయన గుర్తు చేశారు. అయితే అమరావతి రాజధాని పేరిట ఈ విధంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఏ మేరకు సబబు అని ఆయన ప్రశ్నించారు.
లక్ష ఎకరాలలో అంటే :
ఇక చంద్రబాబు 2014 నుంచి 2019 దాకా తొలి విడత ముఖ్యమంత్రిగా ఉన్నపుడు యాభై వేల ఎకరాల భూములను తీసుకున్నారు అని ఆయన చెప్పారు. ఇపుడు 2024 లో అధికారంలోకి వచ్చాక ఆ యాభై వేల ఎకరాలు సరిపోవని అది ఒక మునిసిపాలిటీగానే ఉంటుందని చెప్పి మరో యాభై వేల ఎకరాల భూములను సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది అని దువ్వాడ ఆరోపించారు. లక్ష ఎకరాల భూములలో మౌలిక వసతులను కల్పించడానికి ఏకంగా రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన చెబుతూ ఇంత భారీ మొత్తం వెచ్చిండం వల్ల ప్రాంతీయ వివక్ష వస్తుందని దువ్వాడ అన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ :
అమరావతి రాజధాని అంటూ ఎంతసేపూ డైవర్షన్ పాలిటిక్స్ కి టీడీపీ తెర లేపుతోందని ఆయన విమర్శించారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత అంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు కానీ శాశన మండలిలో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. అసలు రాజధానికి చట్టబద్ధత అన్నది ఎక్కడా లేదని ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని పాలిస్తే అదే రాజధాని అవుతుందని ఆయన అన్నారు. దేశంలో చాలా చోట్ల చూస్తే రాజధాని అయిన ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాయని ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇది దుర్మార్గమైన ఆలోచన అని ఆయన అన్నారు. చట్టానికి రాజధానికి సంబంధం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రా ఉద్యమం :
అమరావతి రాజధాని మీదనే ప్రభుత్వం మొత్తం ఫోకస్ పెట్టి పనిచేస్తే మాత్రం వెనకబడిన ఉత్తరాంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. వెనుకబడిన ప్రాంతాల నిర్లక్ష్యం మీద గట్టిగా పోరాడుతామని అన్నారు. ఉత్తరాంధ్రా ప్రాంత ప్రయోజనాల కోసం తాను పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద చూస్తే అమరావతి రాజధాని విషయంలో వైసీపీ నేతలు మావిగాన్ అంటూంటే ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఉత్తరాంధ్రా ప్రత్యేక రాష్ట్రం అంటున్నారు. దీంతో ఏపీ రాజకీయాలో రాజధాని వివాదం ఏ రూపు తీసుకుంటుంది అన్నది అంతు బట్టడం లేదని అంటున్నారు.