కేంద్ర మంత్రి రామ్మోహ‌న్‌పై బీజేపీ ఎమ్మెల్యే గుస్సా...?

ఆయ‌నో బీజేపీ ఎమ్మెల్యే.. అయితే కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడి మీదే తీవ్రంగా గుస్సా అవుతున్నారు.;

Update: 2026-04-10 15:30 GMT

ఆయ‌నో బీజేపీ ఎమ్మెల్యే.. అయితే కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడి మీదే తీవ్రంగా గుస్సా అవుతున్నారు. రామ్మోహ‌న్ నాయుడు అంటేనే వివాదాల‌కు దూరంగా ఉంటారు. అంద‌రితోనూ సౌమ్యంగా ఉంటారు. మ‌రి అలాంటి రామ్మోహ‌న్‌పై గుస్సా అవుతున్న ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవ‌రు ? ఆ క‌థ ఏంటో చూద్దాం. విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు స్వ‌ప‌క్షం అయినా, విప‌క్షం అయినా లాజిక్ దొరికితే గ‌ట్టిగా ఉడుం ప‌ట్టు ప‌ట్టేస్తారు. ఎడా పెడా ఏకిప‌డేస్తుంటారు. తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తోన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ వ‌చ్చే జూన్ లేదా జూలైలో ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుంది.

ఈ ఎయిర్‌పోర్టు కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభించిన వెంట‌నే విశాఖ సిటీ మ‌ధ్య‌లో ఉన్న ఎయిర్‌పోర్టును పూర్తిస్థాయిలో నావికాద‌ళ అవ‌స‌రాల కోసం ఇచ్చేస్తామ‌ని కూడా రామ్మోహ‌న్ నాయుడు చెప్పేశారు. ఇది విష్ణుకుమార్ రాజుకు న‌చ్చ‌లేద‌ట‌. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో సౌక‌ర్య‌వంతంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను మూసేసి.. ఎక్క‌డో న‌గ‌రానికి దూరంగా.. రెండు గంట‌ల ప్ర‌యాణించి ఎయిర్‌పోర్టుకు వెళ్ల‌మ‌ని చెపుతారా ? అంటూ విష్ణుకుమార్ రాజు అస‌హ‌నంతో ఫైర్ అవుతున్నారు.

ఇది త‌న అభిప్రాయం మాత్ర‌మే కాద‌ని.. విశాఖ న‌గ‌ర ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌యాణికులు, పారిశ్రామిక‌వేత్త‌లు, ఉద్యోగులు అంద‌రూ ఇదే అభిప్రాయంతో ఉన్నార‌ని విష్ణుకుమార్ రాజు చెపుతున్నారు. ప్ర‌స్తుతం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ట్రాఫిక్ లేకుండా, స్పీడ్‌గా వెళ్లే ర‌హ‌దారి ఒక్క‌టి కూడా లేద‌ని.. అయినా గోవా, ముంబై, ఢిల్లీ లాంటి చోట్ల రెండేసి విమానాశ్ర‌యాలు ఉన్న‌ప్పుడు వైజాగ్‌లో ఉంటే త‌ప్పేంట‌ని విష్ణుకుమార్ రాజు ప్ర‌శ్నిస్తున్నారు.

విశాఖ సిటీ నుంచి భోగాపురం వెళ్లేందుకు స‌రైన ర‌హ‌దారి లేద‌న్న‌ది విష్ణుకుమార్ రాజు ప్ర‌ధాన అభ్యంత‌రం. అటు ప్ర‌తిప‌క్ష వైసీపీ కూడా ఈ విష‌యంలో తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కూట‌మిలో ఉండి.. టీడీపీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహ‌న్ నాయుడునినే టార్గెట్ చేసేలా మాట్లాడ‌డంతో రేప‌టి రోజు ఎయిర్‌పోర్ట్ ప‌నులు పూర్తి స్థాయిలో మొద‌లైతే విష్ణుకుమార్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో ? చూడాలి.

Tags:    

Similar News