అద్భుతంః ఇక ర‌క్తం కోసం బాధ‌లేదు.. అంద‌రికీ స‌రిప‌డే బ్ల‌డ్ సృష్టించారు..!

Update: 2021-02-13 02:30 GMT
కేవ‌లం స‌మయానికి ర‌క్తం అందుబాటులో లేక ప్ర‌పంచ వ్యాప్తంగా ఏడాది కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ర‌క్తం ఇవ్వ‌డానికి ఎంతో మంది అందుబాటులో ఉన్నా.. రోగికి స‌రిప‌డే బ్ల‌డ్ కావాల్సిందే అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో ఉన్న త‌మ‌వారిని ర‌క్షించుకునేందుకు బంధువులు ఎంత‌టి న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తారో చూస్తూనే ఉంటాం. అలాంటి స‌మ‌స్య‌కు ఇక చెక్ పెట్టే అద్భుత‌మైన ప్ర‌గ‌తికి తొలి అడుగు ప‌డింది!

జపాన్‌ లోని తొకోరోజవా నగరంలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్‌ లో అధునాతన పద్దతిలో కృత్రిమ రక్తాన్ని ఆవిష్క‌రించారు. ఈ కృతిమ రక్తంలో కూడా సహజమైన బ్లడ్ లో ఉన్నట్లుగానే ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలతోపాటు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్ కూడా ఉంటాయి.

ఈ అద్బుతాన్ని ఆవిష్క‌రించిన‌ జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌లు.. ఈ ర‌క్తం ప‌నితీరును ప‌రీక్షించేందుకు కుందేళ్ల‌ను ఎంచుకున్నారు. రక్తహీనతతో బాధ‌ప‌డుతున్న 10 కుందేళ్లను ఎంచుకొని, వాటికి వీరు త‌యారు చేసిన రక్తాన్ని ఎక్కించారు. అయితే.. ఆ కుందేళ్లల్లో ఆరు కుందేళ్ళు ప్రాణాల‌తో ఉండ‌గా.. మరో నాలుగు మృతి చెందాయి.

దీంతో.. ప‌రిశోధ‌న చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యింద‌ని శాస్త్ర‌వేత్త‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ కృత్రిమ రక్తం కుందేళ్ళ ప్రాణాన్ని ఎలా నిలిపిందో..మనుషుల ప్రాణాల‌ను కూడా కాపాడుతుందని శాస్త్రవేత్తలు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అంతేకాదు.. బ‌తికి ఉన్న కుందేళ్ల‌లో ఎటువంటి సైడ్  ఎఫెక్ట్ కూడా క‌నిపించ‌లేద‌ని చెబుతున్నారు వైద్యులు.

ఈ కృత్రిమ రక్తం అన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ వారికీ సరిపోతుందని చెబుతున్నారు. అంతేకాదు ఈ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కృత్రిమ రక్తం ఏకంగా ఒక సంవ‌త్స‌రం పాటు నిల్వ ఉంటుంద‌ట‌. ఈ ప‌రిశోధ‌న‌ను పూర్తి చేసి, సాధ్య‌మైనంత త్వ‌ర‌లో మ‌నుషుల‌కు అందుబాటులోకి తెస్తామ‌ని చెబుతున్నారు. నిజంగా అదే జ‌రిగితే... ఇక‌, ర‌క్తం ల‌భించ‌క ప్రాణాలు పోయే దుస్థితి ఉండ‌క‌పోవ‌చ్చు.
Tags:    

Similar News