మిలటరీ క్యాంటీన్ లో మేడ్ ఇన్ ఇండియా అమలు కావట్లేదా?

Update: 2020-09-20 07:30 GMT
సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ అదే పనిగా వైరల్ అయ్యే పలు అంశాలు గతంలో నలుగురు మధ్యన మాత్రమే చర్చ రూపంలో జరిగేది. ఎప్పుడైతే మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారో.. అప్పటి నుంచి పలు రకాల వాదనలు స్వేచ్ఛగా బయటకు రావటమే కాదు.. వాటిని విధాన పరమైన నిర్ణయాలుగా ప్రకటించే పరిస్థితి. మారిన కాలానికి తగ్గట్లు ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన వేళ.. విదేశీ వస్తువుల్ని ముఖ్యంగా చైనా తయారీ వస్తువులకు చెక్ పెట్టి.. దేశంలో తయారయ్యే స్వదేశీ కంపెనీల ఉత్పత్తుల్నే కొనుగోలు చేయాలన్న ప్రచారం అంతకంతకూ పెరిగింది.

చివరకు ప్రధాని మోడీ సైతం స్వదేశీ వస్తువుల్ని వాడాలని.. ఆట బొమ్మల్ని దేశీయంగా తయారు చేయొచ్చు కదా? అంటూ మన్ కీ బాత్ లోనూ చెప్పేయటం తెలిసిందే. దేశ ప్రధాని నోటి నుంచి అలాంటి సందేశం వస్తుందన్న విషయం పదేళ్ల క్రితం వరకు నమ్మే వారే కాదు. ఇలా దేశ వ్యాప్తంగా మేడ్ ఇన్ ఇండియా వస్తువుల వాడకం దేశానికి ఉపయుక్తంగా ఉంటుందని చెప్పే కేంద్రం.. మిలటరీ క్యాంటీన్లలో మాత్రం స్వదేశీ వస్తువుల్ని మాత్రమే అమ్మేలా మాత్రం నిర్ణయం తీసుకోలేదన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.

బయటవారికి పెద్దగా లెక్కలు తెలీవు కానీ.. దేశ వ్యాప్తంగా ఉన్న మిలటరీ క్యాంటీన్ల టర్నోవర్ ఎంత ఉంటుందో తెలుసా? దగ్గర దగ్గర రూ.17వేల కోట్లకు పైనే. అంత భారీగా స్వదేశీ.. విదేశీ వస్తువుల్ని అమ్మేస్తుంటారు. అలాంటి చోట్ల కేవలం స్వదేశీ ఉత్పత్తుల్ని అమ్మటం ద్వారా మేడిన్ ఇన్ ఇండియాకు మరింత ఊపు వచ్చేలా చేయొచ్చు. కానీ.. అలాంటిదేమీ జరగటం లేదన్న విషయం తాజాగా.. రాజ్యసభలో ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సర్కారు వెల్లడించింది.

దేశ వ్యాప్తంగా ఉన్న మిలటరీ క్యాంటీన్లలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను మాత్రమే అమ్మాలన్న నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ బదులిచ్చారు. దేశ ప్రజలంతా స్వదేశీ ఉత్పత్తుల్ని వినియోగించాలని నూరిపోసే ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే తమ అధీనంలో నడిచే మిలటరీ క్యాంటీన్లలో అదే విధానాన్ని ఎందుకు అమలు చేయనట్లు..?
Tags:    

Similar News