ఏపీ అసెంబ్లీ ధ‌నాధ‌న్‌: మద్యం కుంభకోణంలో 'కింగ్ పిన్' ఎవ‌రు?

తొలుత ఈ చ‌ర్చ‌ను మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత‌ వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఏపీ బ్రాండ్ కోల్పోవ‌డానికి ఈ మ‌ద్యం కుంభ‌కోణ‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.;

Update: 2026-02-13 12:18 GMT

ఏపీ అసెంబ్లీలో కీల‌క అంశంపై శుక్ర‌వారం పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రిగింది. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారంలో 3 వేల కోట్ల రూపాయ‌ల పైచిలుకు ప్ర‌జాధ‌నాన్ని దోచుకున్నార‌ని.. ఈ మొత్తం వ్య‌వ‌హారం కింగ్ పిన్‌గా వ్య‌వ‌హ‌రించిన వారు ఎవ‌రో తేల్చాల‌ని కూట‌మి పార్టీల‌కు చెందిన స‌భ్యులు డిమాండ్ చేశారు. తొలుత ఈ చ‌ర్చ‌ను మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ నేత‌ వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఏపీ బ్రాండ్ కోల్పోవ‌డానికి ఈ మ‌ద్యం కుంభ‌కోణ‌మే కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ద‌శ‌ల వారీగా రాష్ట్రంలో మద్యాన్ని నిషేధిస్తామ‌న్న బ‌ల‌మైన హామీతో 2019లో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని తెలిపారు. కానీ, త‌ర్వాత‌.. అక్ర‌మ విధానాన్ని తీసుకువ‌చ్చి.. ప్ర‌జ‌ల సొమ్ముతో పాటు.. వారి ఆరోగ్యంతో నూ వైసీపీ చెల‌గాట మాడింద‌ని విమ‌ర్శించారు. మ‌ద్యం డిస్టిల‌రీల‌ను బెదిరించి మ‌రీ క‌మీష‌న్లు వ‌సూలు చేశార‌ని.. ఇవ్వ‌ని వారిని రాష్ట్రం నుంచి త‌రిమేశార‌ని ఆరోపించారు. లిక్కర్ కేసుపై 250 రూపాయ‌లు, బీరు కేసుపై 150 రూపాయ‌లు చొప్పున క‌మీష‌న్లు వ‌సూలు చేశార‌ని గుర్తు చేశారు.

లిక్కర్ బిజినెస్‌ను వ్యవస్థీకృత నేరంగా మార్చారని అన్నారు. 3500 కోట్ల రూపాయ‌ల మేర‌కు కుంభకోణా నికి పాల్ప‌డ్డార‌ని.. దీనిలో ఎలాంటి రాజ‌కీయం లేనందుకే.. ఇటీవ‌ల‌ సుప్రీంకోర్టు కూడా లిక్క‌ర్ నిందితుడి కి బెయిల్ ఇవ్వ‌లేమ‌ని తేల్చి చెప్పింద‌న్నారు. నాటి ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలించే వేలాది ప్రజల వాహనాలు సీజ్ చేశారన్నారు. ఆయా వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని వాటిని బాధితుల‌కు అందించే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు.

ప‌లువురు స‌భ్యులు మాట్లాడుతూ.. అస‌లు ఈ కుంభ‌కోణం వెనుక ఎవ‌రు ఉన్నారు? ఈ కుంభ‌కోణంలో అంతిమంగా ల‌బ్ధి పొందిన వారు ఎవ‌రు? అనే విష‌యాల‌పై ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌ని.. కింగ్ పిన్ ఎవ‌రో తేల్చాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు అంతిమ ల‌బ్ధి దారు ఎవ‌రు? అనే విష‌యాల‌ను వెల్ల‌డించ‌క‌పోవ‌డాన్ని మ‌రికొంద‌రు ప్ర‌శ్నించారు. మొత్తంగా తొలి గంట సేపు అసెంబ్లీలో ఈ విష‌యంపై వాడి వేడిగా చ‌ర్చ‌సాగింది.

Tags:    

Similar News