సీజేపీ ఈ హైప్ ని తట్టుకోవడం కష్టమే !
ఈ మాట అన్నది కూడా అభిజిత్ దీప్కేనే. తమ పార్టీ పేరుతో కొంతమంది గూండాలు దూరి పోలీసుల మీద దాడులు చేస్తున్నారు అని దానికి తమకు సంబంధం లేదని అంటున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ అంటూ వాట్సప్ లో స్టార్ట్ అయిన పార్టీ బహుశా ప్రపంచంలో సీజేపీ మాత్రమే ఉంటుందేమో. అంతే కాదు సెటైరికల్ గా సంస్థగా ఏర్పాటు కావడం కూడా అంటే సీజేపీకే చెల్లుతుందేమో. ఇక అందులో ఉన్న వాళ్ళు అంతా కుర్రాళ్ళు. మన తెలుగు సినీ కవి ఆచార్య ఆత్రేయ చెప్పినట్లుగా అయితే కుర్రాళ్ళు కళ్ళాలు లేనోళ్ళు. మరి ఆ కళ్ళాలు లేకపోతే ఏమవుతుంది అన్నదే పెద్ద ప్రశ్న. ఎటు నుంచి ఎలా చూసుకున్నా సీజేపీకి కర్త కర్మ క్రియ అభిజిత్ దీప్కే మాత్రమే కనిపిస్తున్నారు. ఈ యువ నేత విద్యార్ధి నాయకుడిగా ఉంటూ నీట్ పేపర్ లీకేజి మీద ఒక భారీ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.
ఎలా మొదలై ఎలా తిరిగి :
ఇక సీజేపీ విషయం తీసుకుంటే మే 16న ఈ పార్టీ మొదలైంది. డిమాండ్లు ఏంటి అంటే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. అలాగే విద్యార్థులకు న్యాయం చేయాలని నీట్ పరీక్ష రీ ఎగ్జామ్ ద్వారా విద్యార్ధులకు న్యాయం జరిగింది. ఇక కేంద్ర మంత్రి రాజీనామా అన్నది పొలిటికల్ ఇష్యూ. సీజేపీ విద్యార్థుల సమస్యల మీద పోరాటం అన్నది నీట్ రీ ఎగ్జామ్ తోనే ముగిసిన అధ్యాయం అయింది. కానీ కేంద్ర మంత్రి రాజీనామా అంటూ జంతర్ మంతర్ వద్ద సీజేపీ వేదికల మీద చేస్తున్న ప్రసంగాలు మొత్తం రాజకీయంగానే ఉంటున్నాయి. మరి విద్యార్ధులు యువత సమస్యలు ఎక్కడికి పోయాయి అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది.
విద్యార్ధుల మీద విరిగిన లాఠీలు :
పార్లమెంట్ కి మార్చ్ పేరుతో సీజేపీ పిలుపు ఇచ్చింది. ఈ నెల 20న అనుకున్నట్లుగా మార్చ్ ని నిర్వహించింది. అయితే పోలీసుల నిర్బంధం ఉంటుందని సీజేపీ నిర్వాహకులకు తెలుసు. అంతే కాదు 144 సెక్షన్ విధించారని రూల్స్ ని బ్రేక్ చేస్తే పోలీసులు లాఠీలకు పని చెబుతారని తెలుసు. ఇంత తెలిసినా సీజేపీ మార్చ్ కే సై అంది. ఆ సమయంలో రాజకీయ పార్టీలకు అయితే ప్లాన్ బీ ప్లాన్ సీ వంటివి ఉంటాయి. సీజేపీ వాట్సప్ పార్టీగా శైశవ దశలోనే ఉంది కాబట్టి ఏమీ లేకుండా వెర్రి ఆవేశంతో విద్యార్ధులను ఎగదోసింది అన్న విమర్శలు ఉన్నాయి. దాంతో విద్యార్ధుల నడ్డి మీద పోలీసు లాఠీలు విరిగి పడ్డాయి. మరి ఈ నేరంలో సీజేపీకి కూడా ఎంతో కొంత భాగం బాధ్యత ఉంది కదా అని వస్తున్న ప్రశ్నలు సీజేపీ నిర్వాహకుల నుంచి జవాబు ఏదీ అంటున్నారు. అభిజిత్ దీప్కే అయితే తాము సరిగ్గా నిర్వహించలేకపోయామని ఈసారి జాగ్రత్త పడతామని చెబుతున్నారు. మరి ఎంతో మంది విద్యార్ధులకు గాయాలు అయ్యాయి, యువతి ఒకరికి తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా ఉంది. ఈ వెర్రి మొర్రి ఆవేశ కావేశాలకు ఎవరు పూర్తి బాధ్యత తీసుకుంటారు అంటే జవాబు ఉందా అని నిలదీస్తోంది పౌర సమాజంలోని మేధావి వర్గం.
సీజేపీ ముసుగులో గూండాలు :
ఈ మాట అన్నది కూడా అభిజిత్ దీప్కేనే. తమ పార్టీ పేరుతో కొంతమంది గూండాలు దూరి పోలీసుల మీద దాడులు చేస్తున్నారు అని దానికి తమకు సంబంధం లేదని అంటున్నారు. కానీ సీజేపీ ఆందోళనలు ఒక వైపు కొనసాగుతూంటే దానికి సంబంధించినై పర్యవసానాలు ఏవైనా ఆ పార్టీకే ఆపాదించబడతాయి అన్నది అభిజిత్ దీప్కే గుర్తించలేకపోతున్నారు అని అంటున్నారు. అంతే కాదు తాజాగా ఢిల్లీలో మళ్ళీ హింస చెలరేగింది. పోలీసుల మీద అల్లరి మూకలు దాడులు చేశాయి. దీంతో ఇద్దరు ఏసీపీలకు ఇద్దరు ఇన్స్పెక్టర్లకు గాయాలు అయ్యాయి. దాంతో జంతర్ మంతర్ పరిసరాలలో ఇంటర్ నెట్ మీద ఆంక్షలు విధించారు. మరి దీనికి సీజేపీ ఏ మేరకు బాధ్యత వహిస్తుంది అన్నది కూడా పెద్ద ప్రశ్న.
విద్యార్ధుల మీద కేసులు :
విద్యార్ధులకు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అలాంటి వారి మీద కేసులు పడితే వారికి జీవితంలో బ్లాక్ మార్క్. వారి ఉద్యోగ జీవితం కానీ ఇతరత్రా కానీ ఇబ్బందులో పడుతుంది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో కూడా సీజేపీ చెప్పాలని అంటున్నారు. సమస్యల మీద పోరాటాలు చేయడం వేరు ఏకంగా ప్రభుత్వాలను టార్గెట్ చేసి రాజకీయం చేయడం వేరు అంటున్నారు. సీజేపీ తొలి దశలో విద్యార్థుల సమస్యల పేరుతోనే వచ్చింది ఇపుడు అజెండా మారిందా అన్న చర్చ సాగుతోంది. దీని వల్ల లాభం రాజకీయ పక్షాలది అయితే నష్టం కేసుల్లో ఇరుక్కున్న విద్యార్ధులది అవుతుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే సీజేపీ ఫౌండర్ స్థానంలో ఉన్న అభిజిత్ దీప్కే ఇంతటి హైప్ క్రియేట్ కావడాన్ని ఊహించారో లేదో కానీ దాన్ని తట్టుకుని ముందుకు సాగడం మాత్రం కష్టసాధ్యమే అన్న విశ్లేషణలు ఉన్నాయి మరి.