ఓటు పోతే ఏమవుతుంది...సర్ తో చిర్రుబుర్రు !
ఇది మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న. సర్ అంటే ఓటు పదిలంగా ఉంచడమే కాదు బాధ్యత చెప్పాల్సిన ఒక ఉద్యమంగా ఉండాలని అంటున్నారు .
ఓటు అన్నది పౌరుల ప్రాథమిక హక్కు అని చెబుతారు. తీరా పోలింగ్ రోజున చూస్తే కనుక ఓట్లేసే వారు అంతా ఎక్కువగా గ్రామీణ ప్రాంతం సెమీ అర్బన్ జనాలే కనిపిస్తారు. మెట్రో సిటీలు అర్బన్ ఏరియాల్లో నివసించే వారు పోలింగ్ రోజుని హాలీ డేగా భావించి ఎంజాయ్ చేస్తారు. చాలా మంది ఫ్యామిలీ ట్రిప్స్ కి ప్లాన్ చేసుకుని ముందే వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా ఓటు మీద నిరాసక్తత అర్బన్ ఏరియాల్లో ఉంది. రూరల్ లో ఓటుని గర్వంగా భావించే జనాలు ఉన్నా వారికి సర్ ప్రక్రియతో చిర్రెత్తుతోంది. వెరసి తెలుగు రాష్ట్రాలలో సర్ ప్రక్రియ నత్త నడకగానే సాగుతోంది అని అంటున్నారు.
ఓటుకు అదే లోటు :
ఓటు వేయాలి అది పౌరుడిగా తమ బాధ్యత అన్నది చదువరులే ఎక్కువగా గుర్తించడంలేదు. ఇది అతి తెలివి కిందకు కూడా వస్తోంది. ఓటేస్తే ఏమవుతుంది. ఏ రాయి అయితేనేమి పళ్ళూడగొట్టుకోవడానికి అన్నది చదువు నేర్చిన వారి వైరాగ్యభావన. అందుకే వారంతా ఓటు కోసం పోలింగ్ బూత్ ల దాకా పోవడం లేదు. చాలా మంది ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకోవడానికి ఆసక్తిని చూపించడంలేదు. ఇపుడు సర్ ప్రక్రియ పేరుతో పాతికేళ్ళ క్రితం మీ ఓటు ఎక్కడ అని బీఎల్వోలు వచ్చి ఎన్రోల్మెంట్ ఫారం ఇచ్చి ప్రశ్నలు నింపమంటే మెజారిటీ అర్బన్ ఓటర్ చిర్రుబుర్రు లాడుతున్నాడు. ఈ పరిశోధన అంతా ఇపుడు అవసరమా అని కూడా చిరాకు పడుతున్నారు.
సగం పైగా చేరలేదు :
దీంతో బీఎల్వోలు ఇచ్చిన ఎన్రోల్మెంట్ ఫారాలు తిరిగి నింపి వారికి అందించే కార్యక్రమం అర్బన్ ఏరియాలలో పెద్దగా సాగడం లేదని అంటున్నారు. పోష్ ఏరియాల్లో పెద్ద వారు ఉన్న ప్రాంతాలలో అయితే బీఎల్వోలకు అక్కడి ఓటర్ల దర్శన భాగ్యం కూడా కలగడం లేదని అంటున్నారు. దీంతో సర్ ప్రక్రియ అర్బన్ రీజియన్లలో మందకొడిగానే సాగుతోంది అని అంటున్నారు. ఇదంతా అనవసర ప్రహసనంగా చాలా మంది భావిస్తూంటే మేధా వులు అనదగిన వారు సర్ ప్రక్రియనే వ్యతిరేకిస్తున్న వైనాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.
గ్రామీణంలో అయోమయం :
ఇదిలా ఉంటే గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లకు తమ ఓటు హక్కు నిలుపుకోవాలని పట్టుదల ఉన్నా కూడా వారికి అవసరం అయిన సమాచారం తెలియకపోవడం ఫారం ఎలా నింపాలో అర్ధం కాకపోవడంతో అయోమయంలో పడుతున్నారని అంటున్నారు. వివరాలు తప్పుల తడకగా నింపి ఇచ్చిన వారు కూడా ఉన్నారని అంటున్నారు. ఇక బీఎల్వోల తీరు చూస్తే ఏదో విధంగా ఫారాలను పంపిణీ చేయడం తిరిగి పూర్తి చేసిన వాటిని తెప్పించుకోవడం ద్వారా తమ బాధ్యత ముగించేస్తున్నామని భావిస్తున్నారు. అంతే తప్ప జనాలకు ఎడ్యుకేట్ చేద్దామనుకునే వారు బహు తక్కువగా ఉన్నారని అంటున్నారు. దాంతో సర్ ప్రక్రియ ఎలా సాగుతోంది అన్నది అంతు చిక్కడం లేదని అంటున్నారు.
అద్దె ఇళ్ళలోనే సగం జనాభా :
ఈ రోజుకీ జనాభాలో సగానికి సగం అద్దె ఇళ్ళలో కాపురం ఉంటున్నారు. దాంతో 2002 నాటికి అప్పటి సర్ లో వారి పేరు ఎక్కడ నమోదు అయింది అన్నది గుర్తించి ఆ వివరాలను తెచ్చుకోవడం కష్టసాధ్యం అవుతోంది అంటున్నారు. దాంతో పాటుగా ఆ పేర్లను ఈ పేర్లను సరిపోల్చి మిస్ మాచ్ అని చాలా ఓట్లను విత్ హెల్డ్ లో పెట్టేస్తున్నారు. సరిగ్గా వివరాలు ఇవ్వని వారిని వలస ఓటర్లుగానో లేదా కనిపించని వారి కేటగిరీలోనో కూడా పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల డెత్ లిస్ట్ లో చేర్చేస్తున్నారు. దీంతో సర్ ప్రక్రియ ఉద్దేశ్యం ఏమిటి ఆచరణలో ఎలా సాగుతోంది అన్నది చూస్తే పొంతన ఉండడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓట్లు పోవడానికా సర్ :
ఇది మేధావుల నుంచి వస్తున్న ప్రశ్న. సర్ అంటే ఓటు పదిలంగా ఉంచడమే కాదు బాధ్యత చెప్పాల్సిన ఒక ఉద్యమంగా ఉండాలని అంటున్నారు .కానీ జరుగుతున్నది వేరుగా ఉందని ఆవేదన వ్యక్తం అవుతోంది. మొత్తం మీద చూస్తే సర్ ప్రక్రియ వల్ల ఏపీలో 43 లక్షల ఓట్లు ఇప్పటిదాకా పోయాయని ఒక అంచనా ఉంది. రానున్న రోజుల్లో అసలు ఫిగర్ బయటకు రావచ్చు. లక్షలలో ఓట్లు పోయేందుకు సర్ ప్రక్రియ దాని కోసం నెలల తరబడి అధికార యంత్రాంగం మునిగి తేలడం బీఎల్వోలకు ప్రత్యేకంగా ఆరు వేల రూపాయలు గౌరవ భృతి ఇలా కాలం ధనం అన్నీ వేస్ట్ అవుతున్నాయన్న భావన అయితే సర్వత్రా ఉంది. ఏపీలో ఈ నెల 31న సర్ ప్రక్రియకు సంబంధించి ముసాయిదా రిలీజ్ అవుతుంది. అందులో ఎన్ని ఓట్లు పోయాయో చూడాలని అంటున్నారు.