రాష్ట్రాలను ఆదుకోవటంలో చేతులెత్తేసిన నిర్మలమ్మ

Update: 2020-10-13 07:15 GMT
కరోనా వైరస్ కొట్టిన దెబ్బ నుండి రాష్ట్రప్రభుత్వాలను ఆదుకోవటంలో కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్  పరిహార సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది. కరోనా వైరస్ కారణంగా కుదేలైన రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితిపై సమావేశం జరిగింది. గతంలోనే ఈ విషయమై రాష్ట్రాలకు కేంద్రం రెండు ఆప్షన్లు ఇచ్చింది. మొదటిదేమో కేంద్రమే గ్యారెంటి ఉండి ఆర్బిఐ నుండి అప్పులు ఇప్పించటం. ఇక రెండోది నేరుగా రాష్ట్రాలే అప్పులు చేసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. అయితే ఈ విషయంలో రాష్ట్రాలు రకరకాలుగా స్పందించాయి.

ఈ విషయమై స్పష్టత కోసం సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్దికమంత్రి నిర్మల సీతారామన్ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాలకు తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేయటానికి కేంద్రమే అప్పులు తీసుకోవటం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పేశారు.  కేంద్రం గనుక ఒకపరిధి దాటి అప్పులు చేస్తే చెల్లించాల్సిన వడ్డీ పెరిగిపోవటంతో పాటు వడ్డీల భారం కూడా ఎక్కువయిపోతుందని చెప్పారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రానికి ఎటువంటి సమస్యుందో అదే సమస్య రాష్ట్రాలకూ ఉంది.

ఈ ఏడాదిలో ఇప్పటికే కేంద్రం రూ . 7.8 లక్షల కోట్లకు బదులు రూ. 12 లక్షల కోట్లు అప్పు తీసుకోవటానికి రెడీ అయిపోయిందట. ఇంతకన్నా అప్పు చేస్తే కేంద్రం చెల్లించాల్సిన వడ్డీలే రాష్ట్రాలకు బెంచ్ మార్కుగా పెరిగిపోతుందన్నారు. అంటే ఇఫుడు కేంద్రం చెల్లించాల్సిన వడ్డీలే ఇకపై అప్పులు చేసినపుడు రాష్ట్రాలు కూడా చెల్లించాల్సొస్తుందని కేంద్రమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.  కాబట్టి అప్పులపై కేంద్రం మీద ఆధారాపడకుండా రాష్ట్రాలే  తమ తిప్పలేవో పడాలంటూ నిర్మలమ్మ తేల్చేశారు.

కేంద్రం చెప్పిన మొదటి ఆప్షన్ కు 21 రాష్ట్రాలు  ఓటేశాయట. కాబట్టి మిగిలిన రాష్ట్రాలు కూడా ఓకే చేస్తే బాగుంటుందన్నట్లుగా చెప్పారు.  అప్పులు చేసే విషయంలో ఏకాభిప్రాయం లేదు కాబట్టి కొన్ని రాష్ట్రాలు కోర్టుకు వెళ్ళే అవకాశాలను కూడా నిర్మల  అనుమానం వ్యక్తం చేశారు. అయితే కోర్టులకు వెళితే సమస్య పరిష్కారం అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు.  మొత్తానికి జీఎస్టీ వ్యవస్ధను ఏర్పాటు చేసేటపుడు కేంద్రం చెప్పిన, ఇచ్చిన హామీలేవి అమల్లోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టమైపోయింది. ఇచ్చిన మాటను కేంద్రమే తప్పినపుడు ఇక రాష్ట్రాలు మాత్రం తామిచ్చిన హామీలకు ఎందుకు కట్టుబడుండాలనే ప్రశ్న తలెత్తుతోంది.  చూద్దాం ఏం జరుగుతుందో.
Tags:    

Similar News