హైడ్రా అదిరే ఆపరేషన్.. 861 ఎకరాల్ని స్వాధీనం

అయితే.. ఈ ఆదేశాల్ని లెక్క చేయకుండా ఎంఏ ముఖీం అనే వ్యక్తి భారీ గెస్ట్ హౌస్ ను నిర్మించారు.;

Update: 2026-04-12 06:33 GMT

ఏళ్లకు ఏళ్లుగా వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని వ్యూహాత్మకంగా వివాదాస్పదం చేసేసి.. కోర్టులను ఆశ్రయించి.. స్టేటస్ కోలు తెచ్చుకోవటం.. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా భవనాలు కట్టుకోవటం ఒక రివాజుగా మారింది. హైదరాబాద్ మహానగరంలో ఈ తరహా వ్యవహారాలు లెక్కలేనెన్ని కనిపిస్తాయి. అయితే.. అందుకు భిన్నంగా సర్కారు భూములను స్వాధీనం చేసుకునే విషయంలో హైడ్రా అదరగొట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహా అక్రమాలకు చుక్కలు చూపిస్తోంది హైడ్రా. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి రూ.15 వేల కోట్లు విలువైన ప్రభుత్వ భూముల్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది.

ఇందుకోసం సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించారు. గంటల పాటు సాగిన ఆపరేషన్ ముగింపు నాటికి 861 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వ వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ భూమి విలువ రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా. గడిచిన పదేళ్లుగా ఐలాపూర్ గ్రామ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భారీ భవనాలు.. ఇండ్లను.. బహుళ అంతస్తుల భవనాల్ని హైడ్రా కూల్చేసింది.

శనివారం ఉదయం 8 గంటలకు మొదలైన కూల్చివేతల ప్రక్రియ రాత్రి వరకు సాగింది. ఈ భారీ ఆపరేషన్ లో హైడ్రాకు దన్నుగా పోలీసులు.. రెవెన్యూ.. జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. ఐలాపూర్ లోని సర్ఫేఖాస్ భూములపై నాలుగు దశాబ్దాలుగా వివాదం నెలకొంది. ఇక్కడి 1 - 220 సర్వే నెంబర్ల వరకు 1263 ఎకరాల భూమి ఉంది. రికార్డుల ప్రకారం చూస్తే.. ఈ భూమి నిజాం పాలకులకు చెందింది. విలీన ప్రక్రియలో భాగంగా ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. 2003లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ భూమిని సర్కారు భూమిగా తేల్చారు.

అయినప్పటికీ ఈ భూములపై హైకోర్టు.. సుప్రీంకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. వీటిని ప్రభుత్వ భూములుగా గుర్తించిన హైడ్రా.. పలు నిర్మాణాలకు రెవెన్యూ ద్వారా నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం భారీ ఎత్తున సిబ్బంది..బుల్డోజర్లు.. పోలీసులతో కూల్చివేతల్ని షురూ చేశారు. ఐలాపూర్ సర్వే నెంబరు 1 -220 వరకు ఉన్న ప్రభుత్వ భూమిలో ఎలాంటి కట్టడాలు చేయొద్దని 1998లో హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చారు.

అయితే.. ఈ ఆదేశాల్ని లెక్క చేయకుండా ఎంఏ ముఖీం అనే వ్యక్తి భారీ గెస్ట్ హౌస్ ను నిర్మించారు. అంతేకాదు.. 40 ఎకరాల పరిధిలో ఏకంగా ఫాంహౌజ్ ను నిర్మించాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి హద్దులు పెట్టటంతో పాటు.. అటువైపు కన్నెత్తి చూసేందుకు వీల్లేని విధంగా కాపలా పెట్టేశాడు. అక్కడితో ఆగకుండా ఆ భూములను తెగనమ్మటం మొదలుపెట్టాడు.

ఈ భూమల స్వరూపాన్ని మార్చొద్దని.. హైకోర్టును ఆశ్రయించిన ఇరుపక్షాలకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల్ని పట్టించుకోకుండా 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం అరంతస్తుల అపార్టుమెంట్ ను నిర్మించాడు. దీన్ని కూడా హైడ్రా కూల్చేసింది. స్విమ్మింగ్ ఫూల్ సహా విలాసవంతంగా నిర్మించిన గెస్ట్ హౌస్ ను.. గుర్రాల కోసం నిర్మించిన శాలలను తొలగించింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఇక్కడ ఎంఏ ముఖీం న్యాయవాది బీఆర్ఎస్ నేత కాగా.. స్వయాన ఆయన తమ్ముడు ఎంఏ ఫహీం కాంగ్రెస్ నాయకుడు. ప్రస్తుత రాష్ట్ర ఫఉడ్ కార్పొరేషన్ ఛైర్మన్ కూడా.

శనివారం హైడ్రా తలపెట్టిన భారీ ఆపరేషన్ ను అడ్డుకునేందుకు బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సామాగ్రిని తీసుకొని ఖాళీ చేసేందుకు సామాన్లను కుప్పగా పోసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత కూల్చివేతలకు హైకోర్టు విధించిన స్టే కాపీ అందటంతో కూల్చివేతలకు హైడ్రా తాత్కాలికంగా బ్రేక్ వేసింది. హైడ్రా ఆపరేషన్ ను స్థానికంగా ఉండే రాజగోపాల్ నగర్ ఫ్లాట్ల యజమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.ప్లాట్ల కోసం కోర్టులో పోరాడుతున్నామని.. న్యాయం జరుగుతుందని వారు చెబుతున్నారు. హైడ్రా కూల్చివేతల్ని తాము స్వాగతిస్తున్నట్లుగా రాజగోపాల్ నగర్ అసోసియేషన్ వెల్లడించింది. ఐలాపూర్ లో భారీ ఆపరేషన్ కు హైడ్రా వారం క్రితమే ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.క్షేత్రస్థాయిలో అక్రమణలకు గురైన స్థలాల్ని.. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించి.. కూల్చివేతలు చేపట్టారు.

Tags:    

Similar News