యస్ బ్యాంక్ ఫౌండర్ కి నో బెయిల్

Update: 2021-01-25 23:30 GMT
ప్రైవేటు రంగంలో ‘యస్’ బ్యాంకును స్థాపించి దేశంలో టాప్ లోకి తీసుకొచ్చిన ఆ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కు తాజాగా మరోసారి గట్టి షాక్ తగిలింది. 2020 మార్చిలో మనీలాండరింగ్ కేసులో రాణాకపూర్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) లోని వివిధ సెక్షన్ల కింద రాణాకపూర్ ను ఈడీ అరెస్ట్ చేసింది. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్.ఎఫ్.ఎల్) సంస్థకు రుణం మంజూరు చేసినందుకు రాణాకపూర్, ఆయన సతీమణి, ముగ్గురు కూతుళ్లకు రూ.600 కోట్ల ముడుపులు అందాయని అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

గత ఏడాది జులైలో రాణా కపూర్ దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను ముంబై ప్రత్యేక న్యాయస్తానం తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

సింగిల్ బెంచ్  సోమవారం విచారించింది.  తన క్లయింట్ 600 కోట్లు ముడుపులు తీసుకోలేదని రాణాకపూర్ తరుఫున న్యాయవాది వాదించారు. ఈడీ మాత్రం తీసుకున్నాడని.. ఈ బ్యాంకు సహ యజమానులుగా రాణాకపూర్ కూతుళ్లు కూడా తీసుకున్నారని పేర్కొంటూ బెయిల్ వద్దంటూ వ్యతిరేకించారు.

వివిధ కంపెనీలకు భారీగా మంజూరు చేసిన రుణాలకు గాను ముడుపులుగా రాణాకపూర్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు రూ.4300 కోట్ల ముడుపులు అందాయని ఈడీ ఆరోపించింది. దీంతో బెయిల్ ను కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.
Tags:    

Similar News