అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డ్ ఇక అంత ఈజీ కాదు!
అగ్రరాజ్యం అమెరికా అందరికీ కలల దేశం. అక్కడ ఉండాలని.. జాబులు చేయాలని.. డాలర్లు సంపాదించాలని ఎంతో కలలు కని ఉంటారు.;
అగ్రరాజ్యం అమెరికా అందరికీ కలల దేశం. అక్కడ ఉండాలని.. జాబులు చేయాలని.. డాలర్లు సంపాదించాలని ఎంతో కలలు కని ఉంటారు. అయితే ఇప్పుడు అక్కడ సెటిల్ అవ్వడం అంత ఈజీ కాదు.. అందుకే చాలా మంది అమెరికాలో సెటిల్ అయ్యేందుకు అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకొని శాశ్వత నివాసిగా ఉండిపోవాలనుకుంటారు. అయితే ఇన్నాళ్లు సాగిన ఈ ఆట ఇప్పుడు ట్రంప్ సర్కార్ సాగనివ్వకుండా అడ్డుకట్టవేసింది. దశాబ్దాలుగా అమెరికా పౌరుడిని వివాహం చేసుకోవడం అనేది గ్రీన్ కార్డ్ పొందడానికి ఒక ‘గోల్డెన్ గేట్’లా ఉండేది. కానీ 2026 నాటికి మారుతున్న రాజకీయ, చట్టపరమైన పరిస్థితులు ఈ మార్గాన్ని ముళ్ల బాటగా మారుస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం వలస విధానాలపై ఉక్కుపాదం మోపుతుండటమే దీనికి ప్రధాన కారణం.
అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి అత్యంత సులభమైన మార్గంగా భావించే 'వివాహ గ్రీన్ కార్డ్' ఇకపై అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేయడంతో పెళ్లి ద్వారా గ్రీన్ కార్డ్ పొందడం ఇప్పుడు ఒక సవాలుగా మారింది.
కఠినతరం అవుతున్న నిబంధనలు.. కీలక మార్పులు ఇవే..
కేవలం గ్రీన్ కార్డ్ కోసమే చేసుకునే నకిలీ వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు ఎదుర్కోబోయే ప్రధాన సవాళ్లు ఉన్నాయి. దంపతుల మధ్య బంధం నిజమైనదని నిరూపించడానికి గతంలో కంటే ఎక్కువ ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు అయ్యే ఖర్చు భారీగా పెరిగింది.. ఇది సామాన్య వలసదారులపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. డాక్యుమెంట్లలో చిన్న తప్పు ఉన్నా లేదా అనుమానం వచ్చినా.. విచారణ పేరుతో ఏళ్ల తరబడి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచుతున్నారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
అమెరికా ఇమిగ్రేషన్ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2025లో వివాహ ఆధారిత పిటిషన్లపై రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్.ఎఫ్.ఈ) దాదాపు 15 శాతం పెరిగాయి. అంటే అధికారులు దరఖాస్తుదారులను మునుపటి కంటే ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు.. అదనపు సాక్ష్యాధారాల కోసం వేధిస్తున్నారు.
సాధారణంగా అమెరికా పౌరుల జీవిత భాగస్వాములకు వీసా కోటాతో సంబంధం లేకుండా ఇమిడియట్ రిలేటివ్ కేటగిరీలో ప్రాధాన్యత లభించేది. అయితే జనవరి 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త వీసా కోటా సవరణల వల్ల ఈ కేటగిరీలో ఉన్న వారికి కూడా వేచి చూసే సమయం పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లి ద్వారా గ్రీన్ కార్డ్ పొందాలనుకునే వారు కేవలం కాగితాల మీద ఆధారపడకుండా ప్రతి చిన్న విషయాన్ని డాక్యుమెంట్ చేసుకోవాలి. చట్టపరమైన చిక్కులు రాకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమమని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డ్ ఖాయం అనే పాత సూత్రం ఇక పనికిరాదు. ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వేలాది మంది వలసదారుల కలలపై నీళ్లు చల్లుతున్నాయి. అమెరికాలో అడుగుపెట్టాలన్నా.. అక్కడ స్థిరపడాలన్నా ఇకపై నిజాయితీతో పాటు ఓపిక కూడా చాలా అవసరం.