రేవంత్ దూకుడుని మ్యాచ్ చేసేవారు లేరా ?
తెలంగాణా రాజకీయాల్లో ఇపుడు రేవంత్ రెడ్డి శకం నడుస్తోంది. ఆయన రాజకీయంగా చూస్తే యువకుడి కిందనే లెక్క.;
తెలంగాణా రాజకీయాల్లో ఇపుడు రేవంత్ రెడ్డి శకం నడుస్తోంది. ఆయన రాజకీయంగా చూస్తే యువకుడి కిందనే లెక్క. ఆయనకు ఆయనే చెప్పినట్లుగా మరో ఇరవయ్యేళ్ళ పాటు దూకుడుగా రాజకీయం చేయగల సత్తా ఉన్న వారు. అదే సమయంలో ప్రత్యర్ధుల ఎత్తులను ఎంతో చాకచక్యంగా వ్యూహాత్మకంగా తిప్పుకొట్టగల సమర్ధత ఆయన సొంతం. క్షేత్ర స్థాయి నుంచి ఎదిగి వచ్చిన వారు కావడం ఆయనకు సానుకూల అంశం. అంతే కాదు మంచి మాటకారి కావడం ఇంకో ప్లస్ పాయింట్. ఇక దేనికైనా వెరవని తీరు రాజకీయ జోరు రేవంత్ రెడ్డి ప్రత్యేకతలు.
కేసీఆర్ స్థాయిలో :
తెలంగాణా వచ్చుడో నేను చచ్చుడో అని ఉద్యమ సమయంలో కేసీఆర్ ఒక పవర్ ఫుల్ స్లోగన్ ఇచ్చారు. ఆయన బక్క పలచగా ఉంటారు. ఈయన వల్ల ఏమి అవుతుందని అంతా అనుకున్నారు. కానీ కేసీఅర్ ఫిజిక్ కాదు ఆయన వ్యూహాలు ఎత్తుగడలు ఎంతో పదుని తేరి ఉంటాయి. ఇక కేసీఆర్ వాక్చాతుర్యం ప్రత్యర్ధులను తనదైన శైలిలో చీల్చి చెండాడే తత్వం ఇవన్నీ ఉద్యమ కాలంలో ఆయనకు కవచ కుండలాల మాదిరిగా పనిచేశాయి. అనంతర కాలంలో కూడా కేసీఆర్ మాట్లాడితే ప్రత్యర్ధులకు సైలెన్స్ గతి అన్నట్లుగా ఆయన స్పీడ్ ఉండేది. మీడియా ముందు మాట్లాడినా లేక పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడినా కేసీఆర్ ప్రసంగాల ప్రవాహం ఒక రేంజిలో ఉండేది. ఆయన ధాటికి ఎవరూ తట్టుకోలేని పరిస్థితి ఉండేది. తెలంగాణా రాజకీయాలలో ఎంతో మంది వక్తలు ఉన్నారు, కానీ కేసీఆర్ లా మాస్ పల్స్ పట్టుకుని ఉర్రూతలూగించిన వారు బహు తక్కువ. ఆ పట్లు ఆ వాగ్ధాటి మళ్ళీ రేవంత్ రెడ్డికే పూర్తిగా ఉందని ప్రత్యర్ధులు సైతం అంగీకరించే విషయం. కేసీఆర్ మాట్లాడితే ఎలా అంతా నిలబడి వింటూండిపోతారో అలాగే రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా కట్టి పడేస్తుంది.
ఆ సన్నివేశం లేదుగా :
అయితే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఈ ఇద్దరిలో ఎవరు వాగ్దాటిలో నిలిచి గెలిచేది అంటే అది ఎవరూ చెప్పలేని విషయంగానే ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరూ ముఖా ముఖీ తారసపడినది లేదు, అసెంబ్లీలో అయితే అది సాగేది కానీ అలా జరగడంలేదు. శీతాకాలం అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ అటెండ్ అవుతారు అనుకుంటే అది కూడా మిస్ అయింది. ఇక రేవంత్ రెడ్డి సీఎం హోదాలో సభలో గట్టిగా ప్రభుత్వ వాదనలు వినిపిస్తూంటే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ నుంచి ఎవరు ధీటుగా ఎదుర్కొంటారు అన్నది ఒక చర్చగా ఉంది. అయితే బీఆర్ఎస్ లో హరీష్ రావు చాలా వరకూ మాస్ పల్స్ ని పట్టుకుని మాట్లాడే వక్తగా ఉంటారు. అందుకే ఆయనకు డిప్యూటీ లీడర్ హోదా లభించింది. అయితే రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నారు, అంతకు ముందు విపక్షంలోనూ ఉన్నారు. అలా రెండు వైపులా రాణించి వచ్చిన వారు. దాంతో ఆయన తన వాక్చాతుర్యంతో సభలో దూసుకుపోతుంటే ఏమి చేయాలన్నది పెద్ద ప్రశ్నగానే ఉంటుంది. ఏది ఏమైనా ఈసారి నీటి వివాదానికి సంబంధించి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య భారీ డైలాగ్ వార్ అసెంబ్లీ వేదికగా ఉంటుందని అంతా ఎదురు చూసిన వేళ అలా కాకుండా పోయింది అని అంటున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డిని మ్యాచ్ చేసే వారు ఇప్పటికి అయితే తెలంగాణా రాజకీయాల్లో లేరా అంటే అలాగే అనిపిస్తోంది. కేసీఆర్ జోక్యం చేసుకుని సీన్ లోకి రావడం లేదు, దాంతో విపక్షం కూడా తేలిపోతోంది అన్న మాట గట్టిగా వినిపిస్తోంది.