రహస్యాల పేట.... పుతిన్ ఉండే రాజ కోట!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అంటేనే ఒక అంతుచిక్కని రహస్యం.. ఆయన వ్యూహాలే కాదు.. ఆయన నివసించే భవనాలు కూడా అంతే మిస్టరీగా ఉంటాయి.;

Update: 2026-01-03 00:30 GMT

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అంటేనే ఒక అంతుచిక్కని రహస్యం.. ఆయన వ్యూహాలే కాదు.. ఆయన నివసించే భవనాలు కూడా అంతే మిస్టరీగా ఉంటాయి. ఇటీవల రష్యాలోని పుతిన్ నివాసాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు యత్నించిందన్న వార్తల నేపథ్యంలో క్రెమ్లిన్ అధినేతకు ఉన్న అధికారిక, అనధికారిక నివాసాల గురించి ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ మొదలైంది.

ది క్రెమ్లిన్.. రష్యా అధికారిక శక్తి కేంద్రం

మాస్కో నడిబొడ్డున ఉన్న ‘క్రెమ్లిన్’ రష్యా రాజకీయాలకు వెన్నెముక. ప్రపంచ దేశాల నేతలకు పుతిన్ ఇక్కడే ఆతిథ్యమిస్తారు. అయితే కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈ కోటలో పుతిన్ రాత్రి వేళల్లో బస చేయడం చాలా అరుదు. ఇది కేవలం అధికారిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం.

నోవో-ఒగర్యోవో : అసలైన కార్యాలయ నివాసం

మాస్కో పశ్చిమ ప్రాంతంలో ఉండే ఈ భవనం.. పుతిన్ నిత్యం గడిపే ప్రధాన నివాసం. పాలనపరమైన నిర్ణయాలు.. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు ఇక్కడి నుంచే జరుగుతాయి. దీని చుట్టూ గాలిలో కూడా రక్షణ కవచం ఉంటుందని చెబుతారు.

వల్డాయ్ ఎస్టేట్ : విలాసాల హేమంతం..

సుమారు 250 హెక్టార్లలో విస్తరించిన ఈ ఎస్టేట్ ఒక ఆధునిక గ్రామం లాంటిది. 80 భవనాలు, మినీ కాసినో, సినిమా హాల్, గోల్ఫ్ కోర్స్ సహా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇటీవల 91 డ్రోన్లతో ఉక్రెయిన్ ఇక్కడే దాడికి యత్నించిందని రష్యా ఆరోపించింది.

గెలెండ్ జిక్ ‘పుతిన్ ప్యాలెస్’.. బిలియన్ డాలర్ల మిస్టరీ

నల్ల సముద్ర తీరాన ఉన్న ఈ ప్యాలెస్ పుతిన్ వ్యక్తిగత ఆస్తి అని అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీనివిలువ సుమారు ఒక బిలియన్ డాలర్లు. ఈ ప్రాంతంపై విమానాలు ఎగరడానికి వీల్లేని ‘నో ఫ్లైజోన్’ అమల్లో ఉంది. అయితే క్రెమ్లిన్ మాత్రం దీనికి పుతిన్ కు సంబంధం లేదని బుకాయిస్తోంది.

బోచరోవ్ రుచేయ్ , కేప్ అయా.. వేసవి విడిదులు

సోచీలోని బోచరోవ్ రుచేయ్ పుతిన్ వేసవి విడిది. అలాగే ఆక్రమిత క్రిమియాలోని కేప్ అయాలో కూడా అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ ఉన్నట్లు సమాచారం. ఇక్కడ అత్యవసర సమయాల్లో తప్పించుకోవడానికి ప్రత్యేక సొరంగ మార్గాలు, భూగర్భ బంకర్లు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

పుతిన్ నివాసాలు కేవలం విలాసానికి చిహ్నాలు మాత్రమే కాదు, రష్యా అత్యున్నత స్థాయి భద్రతా వ్యూహాలకు అవి నిదర్శనాలు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ 'రహస్య కోటల' చుట్టూ రక్షణను మాస్కో మరింత కట్టుదిట్టం చేసింది.

Tags:    

Similar News