కొత్త ఏడాది కొత్త ప్రయోగం.. బీఎండబ్ల్యూ, బెంజ్ ప్లాన్ అదుర్స్!

సాధారణంగా కొన్ని కొన్ని బ్రాండ్స్ కొన్ని కొన్ని ఉత్పత్తులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విషయం తెలిసిందే.;

Update: 2026-01-02 22:30 GMT

సాధారణంగా కొన్ని కొన్ని బ్రాండ్స్ కొన్ని కొన్ని ఉత్పత్తులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ బ్రాండ్స్ ఏదైనా ఒక మార్పు తీసుకురావాలని ఆలోచిస్తే మాత్రం అందులో సక్సెస్ అవుతారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బ్రాండ్లు మాత్రం వేరే రంగంలోకి అడుగుపెడితే కచ్చితంగా సక్సెస్ అవుతాయని ఇప్పటికే ఎన్నో సంస్థలు నిరూపించాయి కూడా.. ఉదాహరణకు రిలయన్స్ వంటి సంస్థను మనం తీసుకున్నట్లయితే ఒక్క రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో కూడా రిలయన్స్ తమ హస్తం వేసి సత్తా చాటుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న సంస్థగా పేరు సొంతం చేసుకుంది.

ఇకపోతే బిఎండబ్ల్యూ, బెంజ్ వంటి లగ్జరీ బ్రాండ్ల విషయానికి వస్తే ముందుగా మనకు కార్లు మాత్రమే గుర్తుకొస్తాయి. పైగా ఈ సంస్థలు కార్లు మాత్రమే అమ్ముతాయని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలు చేస్తూ తమ బ్రాండ్ ను మరింత విస్తరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా ఈ బీఎండబ్ల్యూ, బెంజ్ సంస్థలు ఇండియాలో రియల్ ఎస్టేట్ ప్రారంభించబోతున్నాయి. ఇప్పటివరకు రోడ్లపై మెరిసిన ఈ లగ్జరీ కార్ల బ్రాండ్ ఇప్పుడు ఏకంగా భూములపై తమ ముద్ర వేయడానికి సిద్ధం అవుతున్నాయి. తమ కార్లలాగే సంపన్న వర్గాలను ఆకర్షించడానికి ఈ కంపెనీలు బ్రాండెడ్ రెసిడెన్స్ ను నిర్మించేందుకు ఏర్పాటు చేస్తూ ఉండడం గమనార్హం.

అంతేకాదు అందుకు తగ్గట్టుగా అడుగులు కూడా వేసాయి. ఇప్పటికే గురుగ్రామ్ లో మెర్సిడెస్ బెంజ్ తన తొలి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు కోసం పలువురు ప్రముఖ డెవలపర్లతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అంతేకాదు దుబాయ్లో మెర్సిడెస్ బెంజ్ ప్లేసెస్ పేరుతో భారీ టవర్లను కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది.

కేవలం రియల్ ఎస్టేట్ లగ్జరీ ఇల్లు మాత్రమే కాకుండా తమ బ్రాండ్ విలువను ప్రతిబింబించే జీవనశైలిని అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం. ఇకపోతే మెర్సిడెస్ బెంజ్ మాత్రమే కాకుండా బిఎండబ్ల్యూ గ్రూప్ కూడా ఇండియా రియల్ ఎస్టేట్ మార్కెట్ పై దృష్టి సారించింది. 2026 చివరి నాటికి దేశంలో లగ్జరీ ఇళ్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది అనే అంచనాలతోనే ఇళ్ల నిర్మాణంలో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కార్ల తయారీలో తాము పాటించే కచ్చితత్వం, టెక్నాలజీ, ప్రీమియం లుక్ ను ఈ భవనాలలో కూడా చూడవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

బిఎండబ్ల్యూ బెంజ్ మాత్రమే కాకుండా ఇటాలియన్ కార్ల దిగ్గజం లంబోర్గిని కూడా ముంబై, చెన్నై వంటి నగరాలలో లగ్జరీ హోమ్స్ నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు అటు మార్కెట్ వర్గాలు కూడా చెబుతున్నాయి.. రియల్ ఎస్టేట్ రంగాలు ఒకప్పుడు స్టార్ హోటల్స్ తో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉండేవి . అయితే ఇప్పుడు ఆటోమొబైల్ బ్రాండ్లు కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టడంతో ప్రపంచ స్థాయిలో రియల్ ఎస్టేట్ ముఖచిత్రం మారబోతోంది అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక మునుముందు రియల్ ఎస్టేట్ కి మరింత డిమాండ్ పెరిగి భూముల విలువలు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News