నివర్ ఎఫెక్ట్.. చెన్నై మహానగరం మునిగింది

Update: 2020-11-25 18:15 GMT
అనుకున్నదే జరిగింది. అంచనాలు నిజమయ్యాయి. ఉన్నట్లుండి మీద పడిన నివర్ తీవ్ర తుపాను చెన్నై మహానగరాన్ని రచ్చ రచ్చ చేసింది. వాతావరణ నిపుణులు అంచనాలకు తగ్గట్లే భారీ వర్షాలు కురవటంతో నగర జీవులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షాల ధాటికి కొన్ని చోట్ల పెద్ద పెద్ద చెట్లు కూలిపోతే.. ఒక మోస్తరు.. చిన్న చెట్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక.. లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోగా.. విమాన సర్వీసుల్ని నిలిపివేశారు.

భారీ వర్షాలను అంచనా వేసిన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లోతట్టు ప్రాంతాలకు చెందిన వారిని తరలించటంతో పెద్ద ముప్పు తప్పింది. వర్షంతో చెన్నైలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం కాగా.. చెంబరాంబక్కం సరస్సునీటి ప్రవాహం పెరిగింది. దీంతో.. రిజర్వాయర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. గడిచిన ఐదేళ్లలో రిజర్వాయర్ ను తెరవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం.

పాతికవేల మందికి పైగా ప్రజల్ని ప్రత్యేక శిబిరాలకు తరలించారు. చెన్నై మహానగరానికి సెలవు ప్రకటించారు. తుపాను తీవ్రత ఇవాళ.. రేపు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముంపు ప్రమాదం పొంచి ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. చెన్నైతో పాటు.. పుదుచ్చేరీలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. తుపాను నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండిపోవాలని..బయటకు రావొద్దని పేర్కొన్నారు. మొత్తానికి నివర్ తుపాను చెన్నై.. పుదుచ్చేరి ప్రాంతాల్ని తీవ్రంగా ప్రభావితం చేయటం గమనార్హం.


Tags:    

Similar News