నిర్భయ దోషులకు ఉరి డేట్ మారింది? తాజాగా ఎప్పుడంటే?

Update: 2020-01-18 05:30 GMT
తప్పు చేసినోడు సుదీర్ఘ న్యాయ విచారణ తర్వాత దోషిగా తేలినా.. అతడికి విధించిన శిక్షను అమలు చేయటానికి ఎన్ని ప్రొసీజర్లు అన్నది అందరికి అర్థమయ్యేలా చేస్తున్నారు నిర్భయ దోషులు. మన న్యాయవ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపేలా.. నిర్భయ దోషులు వ్యవహరిస్తున్న వైఖరి పలువురిని విస్మయానికి గురి చేయటమే కాదు.. న్యాయస్థానాలకు సైతం చికాకు పుట్టించేలా చేస్తోంది. దేశ వ్యాప్తంగా కదిలించి వేసిన నిర్భయ  ఉదంతంలో దోషులకు.. ఏడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత వారికి ఉరిశిక్షను ఖాయం చేస్తూ అత్యున్నత న్యాయస్థానం సైతం ఓకే చేసింది.

నిర్భయ ఉదంతంలో నలుగురికి ఉరిశిక్ష విధించటం.. ఆ నిర్ణయాన్ని అమలు చేయటానికి ఈ నెల (జనవరి) 22న ఉదయం ఆరు గంటలకు డెత్ వారెంట్ ఇష్యూ చేశారు. అప్పటి నుంచి వారిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అదే సమయంలో.. దోషులు సైతం తమకు విధించే శిక్ష అమలును ఆలస్యం చేసేలా వేస్తున్న ఎత్తుగడలు చూస్తే.. దోషులకు ఇన్ని అవకాశాలా? అన్న భావన కలగకమానదు.

వ్యూహాత్మకంగా వేస్తున్న ఎత్తుల కారణంగానే నిర్భయ దోషులకు ఉరిశిక్షఅమలులో ఆలస్యమవుతుంది. నిర్భయ దోషులు నలుగురు కావటంతో వారు ఉరిని తప్పించుకోవటం కోసం చట్టంలోని లొసుగుల్ని వాడుకుంటూ ఉరిశిక్ష వాయిదా పడేలా చేస్తున్నారు. తాజాగా రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం నలుగురిలో ఇద్దరు అప్లికేషన్ పెట్టుకోగా.. ఆయన అందుకు తిరస్కరించారు. చట్టంలోని నిబంధన ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ కు నో చెప్పిన తర్వాత.. ఉరిశిక్ష అమలుకు పద్నాలుగు రోజులు సమయం తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ 17న రాష్ట్రపతి క్షమాభిక్షకు నో చెప్పిన నేపథ్యంలో వారికి ఉరిశిక్షను తొలుత అనుకున్నట్లు జనవరి 22 కాకుండా.. ఫిబ్రవరి ఒకటిన.. ఉదయం ఆరు గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు పేర్కొంది. శిక్ష అమలులో జరుగుతున్న ఆలస్యంపైనా ఢిల్లీ అదనపు సెషన్స్ జడ్జి సతీశ్ కుమార్ అరోడా తాజాగా డెత్ వారెంట్లు జారీ చేశారు.

మరి.. ఫిబ్రవరి ఒకటినైనా ఉరిశిక్ష అమలు అవుతుందా? అంటే సందేహమేనని చెప్పాలి. ఎందుకంటే.. నిర్భయ దోషుల్లో మరో ఇద్దరు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే వీలుంది. వారు అప్లికేషన్ పెట్టుకున్నట్లైయితే.. దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన ముందు దరఖాస్తు మాదిరే తిరస్కరిస్తే.. తిరస్కరించిన తేదీ నుంచి పద్నాలుగు రోజుల తర్వాత మాత్రమే ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంటుందని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటిన నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేస్తారా? అన్నది క్వశ్చన్ గానే చెప్పక తప్పదు.


Tags:    

Similar News