కరోనా నిబంధనలు తుంగలోకి తొక్కి నైట్ పార్టీ - పోలీసుల ఎంట్రీ తో 13 మంది మృతి!
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విజృంభిస్తుంది. రోజురోజుకి కరోనా మహమ్మారి సోకి మరణించే వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇలా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కొందరు విలాసాలు చేస్తూ ..పార్టీలు , క్లబ్స్ అంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా పెరు రాజధాని లిమాలో కరోనా నిబంధనలు ఉల్లంఘించి నైట్ క్లబ్‌లో పార్టీ చేసుకుంటుండగా.. పోలీసులు రాకను గమనించి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుని 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. స్థానిక థామస్ రెస్టోబార్ క్లబ్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఈ పార్టీలో సుమారుగా 120 మంది వరకు పాల్గొన్నట్టు సమాచారం.
అక్కడ పార్టీ జరుగుతున్నట్టు తెలుసుకున్న వెంటనే పోలీసులు .. అక్కడకు చేరుకున్నారు. దీంతో అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది. ఒకరినొకరు నెట్టుకుంటూ బయటకు రావడానికి ప్రయత్నించారని స్థానిక పోలీస్ అధికారి ఒకరు వివరించారు. రెండో అంతస్తులో ఉండటం వల్ల అందరూ ప్రవేశ ద్వారం నుంచి మెట్ల మీదుగా కిందకు రావడానికి ప్రయత్నించారు.. ఈ సందర్భంలో ద్వారం వద్దకు ఒక్కసారిగా ఒకరినొకరు నెట్టుకుంటూ రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని పెరూ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అంతేకాదు, వారిని చెదరగొట్టడానికి పోలీసులు ఎటువంటి ఆయుధాలు, టియర్ గ్యాస్ ఉపయోగించలేదన్నారు. ఒకరినొకరు తోసుకోవడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఇప్పటి వరకు పోలీసులు 23 మందిని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు. అయితే, పోలీసులు టియర్ గ్యాస్ క్యాన్ లతోనే లోపలికి ప్రవేశించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నైట్ క్లబ్ యజమానిపై మహిళా మంత్రి రొసారియో ససియోటా మండిపడ్డారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన ఈ చర్యలకు పాల్పడినట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి కొనసాగుతుంటే ఇటువంటి చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరమని అన్నారు. ప్రభుత్వాలు ఎంత చెప్తున్నా కూడా వినకుండా కొంతమంది ఇలా చేస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.