ట్రంప్‌కు అసలేమైంది? ఆస్ప్రిన్ ఎందుకు తీసుకుంటున్నారు?

అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలిచేపేరు ‘డొనాల్డ్ ట్రంప్’. ఈసారి ఆయన ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.;

Update: 2026-01-02 10:36 GMT

అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలిచేపేరు ‘డొనాల్డ్ ట్రంప్’. ఈసారి ఆయన ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న ఊహాగానాలకు స్వయంగా స్పందించిన ట్రంప్.. వైద్యులు సూచించిన దాని కంటే ఎక్కువ మోతాదులో ఆస్ప్రిన్ తీసుకుంటున్నానని వెల్లడించి సంచలనం రేపారు.

రక్తం పలుచగా ఉండాలన్నదే నా ఉద్దేశ్యం

ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘నా రక్తం పలుచగా ఉండాలన్నదే నా ఆలోచన. గుండెలో చిక్కటి రక్తం ప్రవహించడం నాకు ఇష్టం లేదు. మంచి, పలుచటి రక్తం గుండె ద్వారా ప్రవహించాలి” అని చెప్పారు. రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడకుండా ఉండేందుకు ఆస్ప్రిన్ ఉపయోగపడుతుందని వైద్యులు సూచించారని తెలిపారు. అయితే సాధారణంగా ఆస్ప్రిన్ మోతాదు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.

సిటీ స్కాన్‌ మాత్రమే.. ఎంఆర్ఐ కాదు

ట్రంప్ తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండిస్తూ మరో కీలక విషయం వెల్లడించారు. “నేను అక్టోబర్‌లో సిటీ స్కాన్ చేయించుకున్నాను. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోలేదు” అని స్పష్టత ఇచ్చారు. ఆసుపత్రి సందర్శన సందర్భంగా గుండె, పొత్తికడుపుకు సంబంధించిన పరీక్షలు చేయించుకున్నానని.. అయితే ఆ విషయం బయటకు రావడంతో తన ఆరోగ్యంపై అనవసర ప్రశ్నలు లేవనెత్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

కుడిచేతిపై గాయాలు..మేకప్ తో దాస్తున్నారా?

కొద్దికాలంగా ట్రంప్ కుడిచేతిపై గాయాల మచ్చలు కనిపించడం.. వాటిని మేకప్ తో దాచే ప్రయత్నం చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న ఊహాగానాలుఊపందుకున్నాయి. అయితే దీనిపై అప్పట్లో వైట్ హౌస్ స్పందిస్తూ.. ‘రక్తనాళాలకుసంబంధించిన ఒక చిన్న సమస్య ఉందని.. ఇది వృద్ధుల్లో సాధారణంగా కనిపించేదేనని స్పష్టం చేసింది. తీవ్రమైన అనారోగ్య సమస్య ఏమీ లేదని కూడా తెలిపింది.

మూఢనమ్మకాలు కూడా నమ్ముతానంటూ..

తన మాటల్లోనే ట్రంప్ కొంచెం ప్రత్యేకత చూపారు. ‘నేను కొంతవరకూ మూఢనమ్మకాలను కూడా నమ్ముతాను’ అంటూవ్యాఖ్యానించారు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానని.. అవసరమైన అన్ని పరీక్షలను చేయించుకుంటున్నానని తెలిపారు.

రాజకీయాల్లో ఆరోగ్యం కూడా ఆయుధమే..?

అమెరికా రాజకీయాల్లో నాయకుల ఆరోగ్యం ఎప్పుడూ చర్చనీయాంశమే. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల వేళ ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ప్రతి చిన్న సమాచారం కూడా రాజకీయ కోణంలో విశ్లేషించబడుతోంది.

మొత్తానికి ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఆయన ఆరోగ్యం సరిగా లేదన్న వాదనలకు పూర్తిగా బలం చేకూర్చకపోయినా.. ఆస్ప్రిన్ ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నానన్న అంశం మాత్రం మరో కొత్త చర్చకు దారి తీసింది. భవిష్యత్తులో ఆయన వైద్య నివేదికలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    

Similar News